యుద్ధం అక్కడ… ఎఫెక్ట్ ఇక్కడ! డీజిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మధ్యప్రాచ్యం…
సముద్రం మధ్యలో వరుసగా నిలిచిపోయిన భారీ చమురు ట్యాంకర్లు…
చుట్టూ యుద్ధ నౌకలు…
ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయగా భావించే సముద్ర మార్గంపై పెరుగుతున్న ఉద్రిక్తత…
కట్ టు… భారత్.
ఉదయం… ఒక పెట్రోల్ బంక్.
“డీజిల్ ఉందా అన్నా?” అని ఓ లారీ డ్రైవర్ అడుగుతున్నాడు.
బంక్ ఉద్యోగి పంప్ వైపు చూసి… “ఉంది సార్… కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తుంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం…” అన్నాడు.
అదే సమయంలో…
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను దాదాపు రెట్టింపు చేసింది.
అసలు అక్కడ జరుగుతున్న యుద్ధానికి, ఇక్కడ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి లింక్ ఏంటి? దీనివల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా? పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? పూర్తి లెక్క ఇదీ..
అసలు ఏం జరిగింది? (ది బ్యాక్‌స్టోరీ)
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మిలిటరీ దాడులు తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఓడలను లక్ష్యంగా చేసుకుని అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కేవలం నెల రోజుల్లోనే 8 శాతం పెరిగి, బ్యారెల్‌కు ఏకంగా $85 డాలర్లకు చేరుకుంది.
రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తన పక్షం నుంచి కీలక చర్య తీసుకుంది.జూలై 16 నుంచి అమల్లోకి వచ్చేలా…
డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు ₹8.5 నుంచి ₹15.5కు పెంచింది.
విమాన ఇంధనం (ATF)పై పన్నును ₹7.5 నుంచి ₹14.5కు పెంచింది.
మరోవైపు పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న పన్నును తగ్గించింది.
ఎవరిపై ప్రభావం పడుతుంది?
ఈ పన్ను పెంపు నిర్ణయం వల్ల విదేశాలకు పెద్ద ఎత్తున ఇంధనాన్ని ఎగుమతి చేసి లాభాలు సంపాదించే రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీ కంపెనీలపై నేరుగా ప్రభావం పడుతుంది. వారు అంతర్జాతీయ మార్కెట్ మార్జిన్లను పూర్తిగా క్యాష్ చేసుకోకుండా ఈ పన్ను బ్రేక్ వేస్తుంది.
ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ లెక్క ఏంటి?
చమురు ధరలు పెరిగినప్పుడు భారత రిఫైనరీ కంపెనీలు విదేశాలకు డీజిల్‌ను ఎక్కువగా ఎగుమతి చేయడానికి ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ ధర లభిస్తుంది.
అలా జరిగితే…దేశీయ మార్కెట్లో సరఫరాపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఎగుమతులపై అదనపు పన్ను విధించడం ద్వారా కంపెనీలు మొత్తం ఉత్పత్తిని విదేశాలకు తరలించకుండా సమతుల్యం పాటించేలా చూస్తుంది. అవసరమైతే దేశీయ మార్కెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ఈ విధానం వెనుక ఉద్దేశం.
మరి మనకు డీజిల్ ధరలు పెరుగుతాయా?
ప్రస్తుతం మాత్రం లేదు. ఈ నిర్ణయం దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై కాదు. ఇది కేవలం ఎగుమతులపై విధించిన ప్రత్యేక పన్ను. అంటే… రేపటి నుంచి పెట్రోల్ బంక్‌లో ధరలు పెరిగిపోతాయని ఆందోళన అవసరం లేదు.
అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఇలాగే పెరుగుతూ, ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే భవిష్యత్తులో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే?
ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అనూహ్యంగా పెరిగినప్పుడు రిఫైనరీ కంపెనీలకు వచ్చే అదనపు లాభాల్లో కొంత భాగాన్ని ప్రత్యేక పన్ను రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీనినే విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటారు.
భారత్ ఈ విధానాన్ని 2022లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పన్ను రేట్లను పలుమార్లు సవరిస్తూ వస్తోంది.
మొత్తానికి…
మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైన కథ… భారతదేశంలోని ఒక పెట్రోల్ బంక్‌లో డీజిల్ పంపు దగ్గరికి వచ్చి ముగుస్తోంది.
అయితే ఈరోజు ఆ లారీ డ్రైవర్‌కు డీజిల్ సులభంగా దొరికింది. రేపు కూడా అలాగే దొరకాలంటే… ప్రపంచంలో ఏం జరుగుతుందో మాత్రమే కాదు, మన ప్రభుత్వం బ్యాక్‌స్టేజ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా అంతే ముఖ్యం!








