రికార్డు స్థాయిలో టీటీడీకి విరాళాలు .. ఒక్కరోజే
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భక్తుల నుంచి భారీగా విరాళాలు పోటెత్తాయి. టీటీడీ (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. దాతలు (Donors) స్పందించి ఒక్కరోజే ఏకంగా రూ.96.98 కోట్ల మేర విరాళాలు సమర్పించారు. ఒక్కరోజే మొత్తం 2,460 మంది దాతలు తమ విరాళాలను టీటీడీకి సమర్పించారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అత్యధికంగా ఆన్లైన్ (Online) ద్వారా 2,354 మంది విరాళాలు అందించారు. ఆఫ్లైన్ (Offline) ద్వారా 106 మంది విరాళాలు అందజేశారు. విరాళాల స్థాయిని బట్టి చూస్తే రూ.లక్ష నుంచి రూ.10 లక్షలలోపు విరాళాలు అందించిన వారు 1,212 మంది ఉన్నారు. రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు విరాళం ఇచ్చిన వారు 1,246 మంది ఉన్నారు. ఇక కోటి రూపాయలు, అంతకంటే పైగా విరాళం సమర్పించిన దాతలు ఇద్దరు ఉండటం విశేషం.
టీటీడీ దాతలకు అందించే ప్రివిలేజెస్ (ప్రత్యేక సదుపాయాలు) విధానంలో అధికారులు కీలక మార్పులు తీసుకువచ్చారు. ఈ నూతన విధానం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో పాత విధానం ద్వారా లబ్ధి పొందేందుకు దాతలు ఒక్కసారిగా క్యూ కట్టారు. పాత విధానం ముగిసేలోపు విరాళాలు అందించిన వారికి, పాత సదుపాయాలే కొనసాగుతాయని టీటీడీ ప్రకటించడమే ఈ రికార్డు స్థాయి స్పందనకు కారణం.








