టీటీడీ దాతల సదుపాయాల్లో మార్పులు .. నేటి నుంచి నూతన విధానం అమలు
తిరుమలలో సామాన్య భక్తులకు మరింత దర్శన సమయాన్ని కేటాయించే లక్ష్యంతో వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలిచ్చే దాతలకు కల్పిస్తున్న సదుపాయాల్లో టీటీడీ (TTD) మార్పులు చేపట్టింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. బోర్డు నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) మీడియాకు వెల్లడించారు. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకతతో పాటు ఏకరీతిని తీసుకురావడానికి నూతన పాలసీని తయారు చేశామని, మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇప్పటికే విరాళాలిచ్చిన దాతలకు పాత సదుపాయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదికి శ్రీవారి డైరీలు 10లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 75వేలు ముద్రించేందుకు ఆమోదించాన్నారు. ఎస్వీ మ్యూజియం సందర్శకుల్లో 12ఏళ్లు పైబడిన వారికి రూ.50 ప్రవేశ రుసుం విధించడంతో పాటు మ్యూజియం నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని టాటా సంస్థ (Tata Group)ను కోరాలని నిర్ణయించామని చైర్మన్ తెలిపారు.
రూ.లక్ష విరాళం ఇచ్చేవారికి ఏడాదికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.2లక్షలు ఇచ్చేవారికి ఒకసారి సుపథం, రూ.3.లక్షలు ఇస్తే ఒకసారి ఎస్ఈడీ, ఒకసారి సుపథం, రూ.4లక్షలు ఇచ్చేవారికి రెండుసార్లు సుపథం, రూ.5లక్షలు ఇచ్చేవారికి 3సార్లు సుపథం దర్శనం కల్పిస్తారు. రూ.10 లక్షలు విరాళంగా ఇస్తే ఒకసారి సుపథం, ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.15లక్షలు ఇచ్చేవారికి రెండుసార్లు సుపథం, ఒకసారి వీఐపీ బ్రేక్, 20లక్షలు ఇచ్చేవారికి 3సార్లు సుపథం, రెండుసార్లు వీఐపీ బ్రేక్, రూ.25 లక్షలు విరాళానికి మూడుసార్లు చొప్పున సుపథం, వీఐపీ బ్రేక్ (IP Break Darshan) దర్శనం కల్పిస్తారు. ఇక రూ.50 లక్షలు విరాళంగా ఇస్తే ఏటా నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్‌తో పాటు రెండు కల్యాణోత్సవాలు, ఒకసారి సుప్రభాతంలో పాల్లొనే అవకాశం కల్పిస్తారు. ఇక రూ.75 లక్షలు ఇచ్చేవారికి ఏటా నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్‌తో పాటు ఒక కల్యాణోత్సవం, ఒకసారి సుప్రభాతంలో పాల్గొనవచ్చు. అలాగే రూ.కోటి విరాళం ఇస్తే నాలుగుసార్లు సుపథం, మూడుసార్లు వీఐపీ బ్రేక్‌తో పాటు ఒకసారి సుప్రభాత సేవకు, మూడుసార్లు కల్యాణోత్సవాలకు అనుమతిస్తారు. ఇక రూ.1.50కోట్లు అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏటా నాలుగుసార్లు చొప్పున సుపథం, వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఒకసారి సుప్రభాత సేవకు, ఐదుసార్లు కల్యాణోత్సవాలకు హాజరుకావచ్చు.








