గాదె సాయికృష్ణ కేసులో ఊహించని మలుపు.. సిబిఐ విచారణ పిటిషన్ను ఉపసంహరించుకున్న తల్లి
గాదె సాయికృష్ణ (Gade Saikrishna) లాకప్ డెత్ కేసులో సిబిఐ (CBI) దర్యాప్తు కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకునేందు అనుమతించాలని ఆయన తల్లి విజయలక్ష్మి (Vijayalakshmi) హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం అనుబంధ పిటిషన్ను దాఖలు చేశారు. తన కుమారుడి లాకప్ మరణంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, అలాంటి పిటిషన్ వేయాలని తాను ఎవరికీ సూచించలేదని పేర్కొన్నారు. ఆ పిటిషన్లో చేసిన వాదనలు, కోరిన ఉపశమనాలతో తనకు సంబంధం లేదని తెలిపారు. సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని కోరుతూ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యం నిరర్థకమైందని, దానిని కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు కోరిన అనుబంధ పిటిషన్ను కొనసాగించే ఉద్దేశం లేదని, దానిని ఉపసంహరించుకునేందుకు అనుమతినివ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేయనుంది.








