కడియం శ్రీహరిపై మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసిన కొండా సురేఖ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha, ), స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari)ల మధ్య సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ చేరాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)ను మంత్రి కొండా సురేఖ స్వయంగా కలిసి, కడియం శ్రీహరి వైఖరిపై లిఖితపూర్వకంగా, మౌఖికంగా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ (Constituency) పరిధిలో ఎమ్మెల్యే కడియం తన ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, కావాలనే తనను వివాదాల్లోకి నెడుతున్నారని సురేఖ ఈ భేటీలో ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఇరు పక్షాల మధ్య జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఆమె ఇన్ఛార్జ్కు క్షుణ్ణంగా వివరించారు. మంత్రి సురేఖ వెళ్లబుచ్చిన అసంతృప్తిని, ఆమె చెప్పిన వివరాలను నిశితంగా విన్న మీనాక్షి నటరాజన్ ఆమెకు కీలక సూచనలు చేశారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చిన్న చిన్న మనస్పర్థలను పెద్దవి చేయవద్దని, ఇలాంటి విషయాల్లో కాస్త సంయమనంతో వ్యవహరించాలని సలహా ఇచ్చారు.








