టీమిండియా సెలెక్షన్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు..!
భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ మరియు టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఒక తాజా నిర్ణయంపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని(vaibhav Suryavanshi) అంత త్వరగా అంతర్జాతీయ అరంగేట్రం చేయించాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం మీడియా సృష్టించిన హైప్, ప్రజల్లోని ఎమోషన్స్ చూసి సెలెక్టర్లు తొందరపడ్డారని జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్‌ను రెండో మ్యాచ్‌లోనే పక్కన పెట్టి వైభవ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ కేవలం 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీనితో ఐదో టీ20 మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టి మళ్లీ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రయోగాలపై స్పందించిన వసీం జాఫర్.. అసలు శాంసన్ ఫామ్‌లో లేడనే బలమైన నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి మార్పులు చేయకూడదని హితవు పలికారు.
సంజు శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్‌కు జట్టులో క్రమబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని జాఫర్ గుర్తుచేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే ముందే కేవలం టీమ్‌తో ప్రయాణిస్తూ, వెలుపల నుండి ఆటను గమనిస్తూ అతను ఎంతో నేర్చుకోవచ్చని సూచించారు. అంతేకాని మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో కంగారుగా జట్టులోకి తెచ్చి ఒత్తిడి పెంచడం సరైన పద్ధతి కాదన్నారు. తదుపరి జింబాబ్వే టూర్ కోసం వైభవ్‌ను ఎంపిక చేసి, కేవలం ఒకే ఫార్మాట్ ఆడే సంజు శాంసన్‌ను పక్కన పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వసీం జాఫర్ తన యూట్యూబ్ ఛానల్ లో కామెంట్స్ చేసాడు.








