ఆటా 19వ మహాసభల ఏర్పాట్లు వేగవంతం.. కార్యక్రమ ప్రత్యేకతలు వివరించిన శరత్ వేముల
ATA: బాల్టిమోర్ వేదికగా జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 దేశాల నుండి తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భారీ వేడుకలను నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని బాల్టిమోర్ లో నిర్వహిస్తున్నారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన అమెరికాలోనే అత్యంత పురాతనమైన తెలుగు ఆర్గనైజేషన్ ఆటా అని ఆ సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహాసభల ప్రాముఖ్యత, ఏర్పాట్లు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు.
మహాసభల సన్నాహాలు..
ఆటా బోర్డ్ మీటింగ్ లో బాల్టిమోర్ నగరంలో మహాసభలు నిర్వహించాలని నిర్ణయించిన మరుసటి రోజు నుంచే ఏర్పాట్లు ప్రారంభించామని శరత్ వేముల చెప్పారు. ఈ వేడుకల కోసం అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఉన్న 250 కి పైగా నగరాల నుండి ప్రతినిధులు సంవత్సరం పాటు శ్రమించారని తెలిపారు. ఈ సారి మహాసభల సక్సెస్ కోసం 6 నెలల ముందే 70 ఆహ్వాన కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సాంస్కృతిక, క్రీడలు, డెకరేషన్ వంటి వివిధ విభాగాల్లో ఆసక్తి ఉన్న దాదాపు 400 మంది సభ్యులతో కూడిన కోర్ టీం గత ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పని చేస్తోందని వివరించారు. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో ముందుకు వస్తున్న వాలంటీర్లను కూడా పెద్ద ఎత్తున ఈ పనుల్లో ఇన్వాల్వ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రతిభకు ప్రోత్సాహం..
అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు పిల్లలు తెలుగు సరిగా మాట్లాడలేకపోయినా, పాటలు పాడే విషయానికి వచ్చేసరికి భారత్‌లో ఉన్న సింగర్ల కంటే ఏమాత్రం తీసిపోకుండా అద్భుతంగా పాడుతున్నారని శరత్ వేముల ప్రశంసించారు. అలాంటి లోకల్ టాలెంట్ ను గుర్తించి సరైన కోచింగ్ ఇచ్చి వేదికపైకి తీసుకురావడానికే జుమ్మంది నాదం, సయ్యంది పాదం అనే కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాటలతో పాటు క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి క్రీడల్లో కూడా యువతను ప్రోత్సహించడానికి పోటీలు, కోచింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
అతిథుల వివరాలు..
ఈ బాల్టిమోర్ కన్వెన్షన్ కు దాదాపు 1200 మంది ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన 150 మంది వీఐపీలు వస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను ఆహ్వానించినట్లు చెప్పారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు వంటి రాజకీయ ప్రముఖులతో పాటు ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరోయిన్లు పూజా హెగ్డే, మీనాక్షి చౌదరి వంటి ప్రముఖులను, జానపద గాయకులను ఆహ్వానించామని వివరించారు. అమెరికా ప్రభుత్వం నుండి మేరీలాండ్ గవర్నర్, బాల్టిమోర్ మేయర్, మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్, వర్జినియా గవర్నర్, వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ వేడుకలకు వచ్చేందుకు సమ్మతించారని ఆయన తెలిపారు.
విద్యార్థులు, ఇమ్మిగ్రేషన్ సమస్యలు..
అమెరికాకు వచ్చే వారిలో 18 నుండి 25 సంవత్సరాల లోపు వచ్చే స్టూడెంట్స్ కోసం యూత్ కన్వెన్షన్ ఎంతో ఉపయోగపడుతుందని శరత్ వేముల అన్నారు. స్ప్రింగ్, ఫాల్, సమ్మర్ కాలాల్లో వచ్చే విద్యార్థులకు, వారు ఇండియా నుండి బయలుదేరడానికి ముందే ప్రముఖ తెలుగు ఇమ్మిగ్రేషన్ అటార్నీలతో ఆన్లైన్ ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గైడెన్స్ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ కొంచెం డల్ గా ఉన్న నేపథ్యంలో ఎఫ్1, హెచ్1బి ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రీన్ కార్డుల ఆలస్యానికి సంబంధించి గత 10 లేదా 15 ఏళ్లుగా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య, అలాగే హెచ్1, హెచ్4, ఈ5, ఈ1 కేటగిరీల్లో దరఖాస్తులు విపరీతంగా పెరగడం వల్లే వెయిటింగ్ పీరియడ్ 2 నుండి 3 ఏళ్లు, కొన్నిసార్లు 10 ఏళ్లు పడుతోందని వివరించారు. డాక్యుమెంట్లు లీగల్‌గా కరెక్ట్‌గా ఉంటే ఏ సమస్య రాదని, ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆటా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వ్యాపార అవకాశాలు…
ఐడియా బాజ్ స్ఫూర్తితో స్టార్టప్ కంపెనీలు పెట్టే యువత కోసం ప్రప్రథమంగా బిజినెస్ బజ్ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, ఇందులో టెక్నాలజీ, ఇన్వెస్టర్లను ఒకే చోటికి చేరుస్తున్నామని శరత్ వేముల వెల్లడించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను 3 ఏళ్ల క్రితమే గుర్తించి, గత 2 ఏళ్లుగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఏఐలో ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు…
ఆటా కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుందని ఆయన గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, ప్రభుత్వ స్కూళ్లకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించడం చేస్తున్నామన్నారు. 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ సమయం తర్వాత గంట పాటు ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తున్నట్లు వివరించారు. 2 రాష్ట్రాలుగా విడిపోయినా ప్రపంచంలో ఎక్కడున్నా మన కలలు, ఆచార వ్యవహారాలు, భాష ఒక్కటేనని అన్నారు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం, రాబోయే రోజుల్లో ఎలాంటి బిజినెస్ లు చేయాలి, ఎలాంటి యూనివర్సిటీల్లో చదువుకోవాలి అనే విషయాలపై ఈ సభల ద్వారా దిశా నిర్దేశం చేయడమే తమ ఉద్దేశమని శరత్ వేముల స్పష్టం చేశారు.








