ట్రంప్, నెతన్యాహుపై ఇరానీయుల ఆగ్రహం.. ఖమేనీ అంత్యక్రియల్లో జనసందోహం..!
ఇరాన్ సుప్రీంలీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు సందర్భంగా ఇరాన్ విషాదంలో మునిగిపోయింది. తమ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీని పొట్టనపెట్టుకున్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనని, ఆయన జీవించి ఉండటానికి వీల్లేదని ఇరాన్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ట్రంప్ అంతాన్ని చూడాలంటూ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో నల్లని దుస్తుల్లో పెద్దసంఖ్యలో ప్రజలు పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు.
ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా టెహ్రాన్ జన సంద్రమైంది. కిలోమీటర్ల కొద్దీ ప్రజలు బారులుతీరిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేస్తోంది. ఖమేనీ పార్థివదేహాన్ని, ఆయన కుటుంబికుల మృతదేహాల శవపేటికల్ని ఒక వాహనంలో ఉంచి ప్రజా సందర్శనకు వీలు కల్పిస్తున్నారు. 2020లో రివల్యూషనరీ గార్డ్ జనరల్ ఖాసెం సొలెమని అంత్యక్రియల ఊరేగింపులో దాదాపు 10 లక్షల మందికిపైగా పాల్గొనడం ఒక రికార్డు కాగా ఇప్పుడు అంతకంటే ఎక్కువమంది వస్తున్నట్లు కనిపిస్తోంది.
ట్రంప్ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ.. ఆయన్ని అంతం చేయాలంటూ అనేకమంది నినాద ఫలకాలు, బ్యానర్లు చేతపట్టి కదం తొక్కుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహునూ చంపేయాలని మరికొందరు నినాదాలిస్తున్నారు.
భారత్కు కృతజ్ఞతలు:
భారత్ చూపిస్తున్న మిత్రభావం, సహానుభూతి, హృదయపూర్వక గౌరవాన్ని తాము ఎప్పటికీ మరువలేమని ఇరాన్ దౌత్య కార్యాలయం పేర్కొంది. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొంటున్న భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలిపింది. పరస్పర గౌరవాలను శక్తిమంతంగా చాటేలా ఈ చర్య ఉందని పేర్కొంది.








