మంత్రి జూపల్లిని సీఎం రేవంత్ పక్కన పెట్టేశారా?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క సమీక్షా సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమీక్ష జరగాలన్నా, ఆ శాఖా మంత్రి పాత్ర అత్యంత కీలకం. ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రి కూడా ఆ సమావేశంలో కూర్చుని దిశానిర్దేశం చేయడం ఆనవాయితీ. కానీ, సోమవారం పర్యాటక రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు లేకుండానే, కేవలం అధికారులతోనే సీఎం ఈ సమావేశాన్ని ముగించడం సచివాలయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
హైదరాబాద్‌లో అధికారులు ఫైళ్లతో సీఎం ముందు హాజరై చర్చలు జరుపుతుంటే, అదే సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గంలో ఈతకొడుతూ కనిపించారు. ఈ సమీక్షా సమావేశం గురించిన కనీస సమాచారం కూడా మంత్రికి లేకపోవడం, ఆయనకు సీఎం ఆఫీస్ నుండి పిలుపు రాకపోవడంతోనే సొంత నియోజకవర్గంలో రిలాక్స్ అయ్యారనే చర్చ నడుస్తోంది. అయితే, ఈ వ్యవహారం కేవలం ఒక శాఖ సమీక్షకు పరిమితమైనది కాదని, దీని వెనుక రేవంత్ రెడ్డి మార్క్ పొలిటికల్ సిగ్నల్స్ ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావును ఈ సమీక్షా సమావేశానికి దూరం పెట్టడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల మంత్రి జూపల్లి తన పరిధి దాటి, ఆర్థిక విషయాలపై గత ప్రభుత్వ అప్పుల అంశాన్ని లేవనెత్తారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. అయితే, ఈ సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి హరీశ్ రావు పక్కా ఆధారాలు, లెక్కలతో కౌంటర్ ఇచ్చేసరికి జూపల్లి గారు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. ముందస్తు వ్యూహం, సరైన సమాచారం లేకుండా సవాల్ విసిరి, పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారనే కోపం సీఎం రేవంత్ రెడ్డికి గట్టిగానే వచ్చినట్టు సమాచారం. ఈ సెల్ఫ్ గోల్ వ్యవహారంతోనే సీఎం ఆయనపై సీరియస్ అయ్యారని, అందుకే ఈ సమీక్ష ద్వారా గట్టి సంకేతాలు పంపారని తెలుస్తోంది.
తన శాఖపై తనకే తెలియకుండా రివ్యూ జరిగిపోవడంతో మంత్రి జూపల్లి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. సీఎం మీటింగ్ ముగియగానే, లోపల ఏం జరిగింది? సీఎం గారు ఏమేం ఆదేశాలు ఇచ్చారు? అని అధికారులకు ఫోన్ చేసి జూపల్లి ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. “మీటింగ్‌కు ఎలాగూ పిలవలేదు.. కనీసం ఆ నిర్ణయాలను అమలు చేసేటప్పుడైనా నన్ను నమ్ముతారా? లేక అప్పుడు కూడా పక్కన పెట్టేస్తారా?” అని మంత్రిగారు అధికారుల దగ్గర వాపోయినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ పరిస్థితి కేవలం జూపల్లి కృష్ణారావుకు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో కూడా కొంతమంది కీలక మంత్రులకు సమాచారం లేకుండానే వారి శాఖలపై సీఎం నేరుగా సమీక్షలు నిర్వహించారనే టాక్ ఉంది. తమకు తెలియకుండానే నియామకాలు జరిగిపోతున్నాయని, కనీస ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు మంత్రులు లోలోపల రగిలిపోతున్నారట.
మంత్రి లేకుండానే సీఎం నేరుగా సమీక్ష నిర్వహించడం అనేది పాలనాపరంగా, రాజకీయంగా స్పష్టమైన సంకేతాలను ఇస్తోంది. ప్రభుత్వంలో పూర్తి నియంత్రణ, పట్టు ముఖ్యమంత్రిదేనని, తప్పులు చేస్తే ఎంతటి వారైనా పక్కన పెట్టడానికి వెనుకాడబోననే కఠిన సందేశాన్ని రేవంత్ రెడ్డి పంపారు. అనవసర వివాదాల్లో దూరి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని మంత్రులందరికీ ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేసినట్లయింది. మంత్రులను కాదని నేరుగా అధికారులతోనే సీఎం సమీక్షలు జరపడం వల్ల క్యాబినెట్ సహచరుల్లో ప్రాధాన్యత కోల్పోతున్నామనే భావన బలపడుతుంది.
ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో క్యాబినెట్ లోపల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మంత్రుల్లో పెరుగుతున్న ఈ అసంతృప్తికి, ఈ పొలిటికల్ గ్యాప్‌నకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో, భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తారో వేచి చూడాలి.








