పదవులు ఉన్నా.. లేకున్నా పార్టీ కోసం పని చేస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
తనకు పదవులు ఉన్నా, లేకున్నా రాహుల్‌గాంధీ (Rahul Gandhi)నాయకత్వంలో పనిచేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ (Susheelamma Foundation) ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. పార్టీకి దూరంగా ఉంటున్నాననే మాటల్లో వాస్తవం లేదని, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట ( Yadagirigutta) ఆలయ ధర్మకర్తల మండలి అంశంపై తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడవలసి వచ్చిందన్నారు. పార్టీ మీద వ్యతిరేకతతోనో, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికో మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నానన్న మాటల్లో వాస్తవం లేదని, పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు.
ఇటీవల రాహుల్‌గాంధీ తనతో మాట్లాడిన మాటలకు ఎంతో ప్రభావితమయ్యానని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం పనితీరుతో పాటు తన సలహాలు కూడా రాహుల్ అడిగారని చెప్పారు. తన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవడం ఆయన ఆలోచనా విధానానికి నిదర్శమన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన తనకు ఇచ్చినంత సమయం రాష్ట్రంలోని ఏ నాయకుడికీ రాహుల్ ఇవ్వకపోవచ్చునన్నారు. రాహుల్‌గాంధీ సేవలు దేశానికి ఎంతో అవసమమని, రాబోయే ఎన్నికల్లో ఆయనను ప్రధానిని చేసేందుకు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు.








