వైభవ్ కు మద్దతుగా క్రికెట్ దిగ్గజం..!
టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని(Vaibhav Suryavanshi) అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి ఎప్పుడు దించుతారనే అంశంపై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఈ యువ ఆటగాడిని వెంటనే రంగంలోకి దించాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుంటే.. సీనియర్లకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడంతో.. సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ మరింత తీవ్రతరమైంది.
రవిశాస్త్రి, మైఖేల్ వాగన్, అలిస్టర్ కుక్ వంటి మాజీ దిగ్గజాలు సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లోనే అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ భిన్నంగా స్పందించారు. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి వంద శాతం సిద్ధంగా ఉన్నాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, మూడు నెలల క్రితం టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడని, ఐపీఎల్‌లోనూ రాణించాడని గుర్తుచేశారు.
ఆటగాళ్లకు సుదీర్ఘమైన అవకాశాలు ఇస్తామనే నమ్మకాన్ని కల్పించడం మేనేజ్మెంట్కు ముఖ్యమని.. వైభవ్ ప్రతిభపై నమ్మకం ఉన్నప్పటికీ, అతడు కూడా మిగతా ఆటగాళ్లలాగే ఒక పద్ధతి ప్రకారం (Process) జట్టులోకి రావాల్సి ఉంటుందని కోచ్ సమర్థించుకున్నారు. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ చేసిన వ్యాఖ్యలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తీవ్రంగా విభేదించారు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన డివిలియర్స్.. “సూర్యవంశీని ఇంకా ఎప్పుడు మైదానంలోకి దించుతారు?
ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో జరిగిన సిరీస్ అతడికి అంతర్జాతీయ క్రికెట్ అనుభవాన్ని ఇవ్వడానికి సరైన అవకాశం. కానీ దురదృష్టవశాత్తూ అతడికి ఛాన్స్ ఇవ్వలేదు. మిగతా వారిలాగే సూర్యవంశీ కూడా పద్ధతి ప్రకారం రావాలన్న కోచ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఐపీఎల్లో అతడు చూపించిన ఫామ్ దృష్ట్యా, అతడిని నేరుగా అంతర్జాతీయ పోటీల్లోకి దించాల్సిన సమయం ఆసన్నమైంది” అని డివిలియర్స్ కుండబద్దలు కొట్టారు.








