మహేష్ బాబు ‘రావు బహదూర్’ చూసి సర్ప్రైజ్ అయ్యారు. ‘రావు బహదూర్’ లాంటి చిత్రం ఇప్పటివరకు రాలేదు- నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నిర్మాతగా మీ జర్నీ ఎలా ప్రారంభమైంది? అలాగే ‘రావు బహదూర్’ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
-నిర్మాతగా నేను ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు, యశోద, తమిళంలో సముద్రఖని గారితో తిరుమాణిక్యం, క, చిదంబరం చిత్రాలు చేశాను.
-రావు బహదూర్ ఈ కథను మొదట నమ్రత గారు విన్నారు. ఆమెకు చాలా నచ్చింది. అనంతరం దర్శకుడు వెంకటేష్ మహా గారు నాకు కథ చెప్పారు. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం.
ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారని వినిపిస్తోంది. కంటెంట్‌పై అంత నమ్మకమా?
-అవును. ఇది హై బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. అలాగే కథ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొత్తదనంతో రూపొందించాం.
-కంటెంట్‌పై మాకు ఎంత నమ్మకం ఉందో, నటీనటులపై కూడా అంతే నమ్మకం ఉంది. ముఖ్యంగా రావు బహదూర్ పాత్రకు సత్యదేవ్ గారు పర్ఫెక్ట్గా సరిపోయారు.
-మహేష్ బాబు గారు ఈ చిత్రాన్ని సమర్పించడం వల్ల ‘రావు బహదూర్’ అనే పేరుకే ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చింది. ఆయన పేరు వినగానే ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది.
ఈ పాత్ర కోసం మొదటి నుంచే సత్యదేవ్‌ను అనుకున్నారా?
-అవును. సత్యదేవ్ గారు, దర్శకుడు వెంకటేష్ మహా గారి ఆలోచనలు అద్భుతంగా కలిశాయి. ఈ సినిమా కోసం సత్యదేవ్ గారు ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. అది చిన్న విషయం కాదు. ఈ చిత్రానికి 90 రోజులకు పైగా షూటింగ్ జరిగింది.
-నేను ఎక్కువగా మా ఊరిలోనే ఉంటాను. నెలలో నాలుగు లేదా ఐదు రోజులు మాత్రమే ఇక్కడికి వస్తుంటాను. పరిశ్రమలో నాకు పెద్దగా పరిచయాలు లేవు. అనురాగ్, శరత్ నేను భిన్నమైన సినిమాలు చేయాలనుకోవడం వల్లే వారు ఈ కథతో నా వద్దకు వచ్చారు. చిదంబరం కంటే ముందే ఈ కథను విన్నాను.
దర్శకుడు మహా ఈ సినిమాను ‘బాహుబలి’తో పోలుస్తున్నారు. దాని గురించి చెప్పండి?
-కథ, సెట్స్, కాస్ట్యూమ్స్, నిర్మాణ విలువలు చూస్తే బాహుబలి తరహా భారీ నిర్మాణ అనుభూతి కలుగుతుంది. మేము చెప్పాలనుకుంటున్నది అదే. నిర్మాణ పరంగా ఆ స్థాయి నాణ్యతతో ఈ చిత్రాన్ని రూపొందించాం.
-వెంకటేష్ మహా గారు ఎంతో గొప్ప విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి మేకింగ్‌తో కూడిన సినిమా ఇప్పటివరకు రాలేదు. ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేశారు.
రిలీజ్‌కు ముందే బిజినెస్ ఎలా జరిగింది?
-రిలీజ్‌కు ముందే ఓటీటీ, ఓవర్సీస్ బిజినెస్ పూర్తయింది. మహేష్ బాబు గారి పేరు ఉండటం వల్ల సినిమాకు మరింత మంచి ఇమేజ్ వచ్చింది.
-ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ రోజుల్లో కొత్తదనం లేకుండా సినిమా చేయడం చాలా కష్టం. ఒక జానర్ హిట్ అయిందని అదే తరహాలో మరో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరించడం లేదు.
మహేష్ బాబు గారికి సినిమా చూపించారా? ఆయన స్పందన ఏమిటి?
-మహేష్ బాబు గారు సినిమా చూసి చాలా ఆశ్చర్యపోయారు. 24 క్రాఫ్ట్స్‌లోనూ అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పడం మాకు మరింత నమ్మకాన్ని ఇచ్చింది.
హీరోయిన్ దీపా థామస్ గురించి?
-రాజుల కాలం నాటి పాత్రకు దీపా థామస్ గారు అద్భుతంగా సరిపోయారు. వెంకటేష్ మహా గారు ప్రతి పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోయే నటీనటులనే ఎంపిక చేసుకున్నారు.
సినిమాలో కనిపించే రాజభవనాలు, సెట్స్ గురించి చెప్పండి?
-అన్నీ ఒరిజినల్ లొకేషన్లలోనే చిత్రీకరించాం. ఒడిశాలో ఒక కోటను ఎంపిక చేసుకున్నాం. అక్కడ షూటింగ్ జరగడం ఇదే మొదటిసారి. కథకు తగ్గట్టుగా ఆ కోటలో కొన్ని మార్పులు చేసి, ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించాం. సినిమాలో కనిపించే కాస్ట్యూమ్స్ ఒరిజినల్స్.
దర్శకుడు వెంకటేష్ మహా గురించి?
-వెంకటేష్ మహా గారితో పని చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూసినప్పటి నుంచే ఆయన పనితనం నచ్చింది. ఈ కథ చెప్పినప్పుడు కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారని నమ్ముతున్నాను.
-ఇది థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని ఇచ్చే సినిమా. బిగ్ స్క్రీన్‌పై చూసినప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారు. రావు బహదూర్ ఇప్పటివరకు చూడని ఓ కొత్త సినీ అనుభవాన్ని అందిస్తుంది. ఫిల్మ్ లవర్స్‌కు ఇది పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుంది.
-నేను కథ విన్నప్పుడు ముందుగా దాని నిజాయితీని చూస్తాను. కథలో కొత్తదనం ఉంటే తప్పకుండా చేస్తాను. నేను దర్శకుడిని, కథను నమ్మి సినిమాలు చేయడానికి ఇష్టపడతాను.
భవిష్యత్తులో పెద్ద సినిమాలు చేసే ఆలోచన ఉందా?
-ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో మెట్టు ఎక్కుతూ నేర్చుకుంటున్నాను. ప్రతి సినిమాతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఆ అనుభవమే పెద్ద సినిమాలు చేయడానికి ఉపయోగపడుతుంది.
మీ నెక్స్ట్ ప్రాజెక్టులు?
-వినాయక చవితికి ఒక సినిమా, దసరాకు మరో సినిమా రానున్నాయి. త్వరలో వాటి వివరాలను ప్రకటిస్తాం. ఆ రెండు కూడా పూర్తిగా భిన్నమైన, ప్రత్యేకమైన చిత్రాలు.








