హైదరాబాద్‌లో క్రికెట్ పండుగ, ఘనంగా ‘TG20 లీగ్’..!
తెలంగాణ(Telangana) క్రికెట్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు ‘TG20 లీగ్’ సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్‌ను ప్రారంభించడానికి భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. వీరి సమక్షంలో టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ, ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.
స్థానిక క్రికెట్ ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ‘TG20 లీగ్’ ఉప్పల్ స్టేడియంలో సుదీర్ఘంగా 22 రోజుల పాటు సాగనుంది. ఈ లీగ్‌లో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తం 8 జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ తరహా ఫార్మాట్లో సాగే ఈ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.
ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే ఈరోజే టోర్నీలో మొదటి మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7.15 గంటలకు ప్రారంభమయ్యే ఈ తొలి సమరంలో ‘పాలమూరు’, ‘ఖమ్మం’ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లలోనూ నైపుణ్యం గల ఆటగాళ్లు ఉండటంతో మొదటి మ్యాచ్‌లోనే హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








