సీఐ నాగరాజును కాపాడుతున్న ‘సింగం’ ఇమేజ్..?
కృష్ణలంక(Krishna Lanka) రౌడీషీటర్ గాదె సాయికృష్ణ(Gadhe Sai Krishna) అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై(Ci Nagaraju) హత్య కేసు నమోదు కావడం, కూటమి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. సాధారణంగా లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పోలీస్ అధికారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. కానీ, ఈ కేసులో సీఐ నాగరాజు విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ఆయన అరెస్ట్ విషయంలో జాప్యం జరుగుతోందనే ప్రచారం ఒకవైపు సాగుతుంటే.. అసలు ఆయనను కాపాడుతోంది చట్టపరమైన లూప్‌హోల్స్ కాదని, ప్రజల్లో ఆయన సంపాదించుకున్న ‘సింగం’ లాంటి మాస్ ఇమేజ్ అనే బలమైన అభిప్రాయం ఇప్పుడు రాజకీయ, పోలీస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
విజయవాడ కృష్ణలంక అంటే ఒకప్పుడు బ్లేడ్ గ్యాంగ్‌లు, గంజాయి ముఠాలు, స్థానిక రౌడీల ఆగడాలకు కేరాఫ్ అడ్రస్ అని స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. సీఐ నాగరాజు ఇక్కడ బాధ్యతలు చేపట్టాక, శాంతిభద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించారనే పేరుంది. ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ గంజాయి బ్యాచ్‌ల ఆట కట్టించారని, కాలనీల్లో రౌడీషీటర్ల తోకలు కత్తిరించారని స్థానికులు చెబుతుంటారు. నేరస్తుల పట్ల ఆయన చూపించిన ఆ ‘సింగం’ స్టైల్ యాక్షనే.. ఈరోజు ఆయన చుట్టూ ఒక పెద్ద రక్షణ కవచంలా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక రౌడీషీటర్ మరణం వెనుక ఆయన హస్తం ఉందనే ఆరోపణలు వచ్చినప్పటికీ, “మా ఏరియాను ప్రశాంతంగా ఉంచిన అధికారి మాకు కావాలి” అంటూ స్థానిక కాలనీవాసులు, ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి మద్దతు పలకడం వెనుక ఉన్న రహస్యం ఇదే.
ఈ కేసులో కూటమి ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు ఆదేశించినప్పటికీ.. స్థానిక జనసేన నేతలు మరియు కొంతమంది కూటమి నాయకులు బహిరంగంగానే ఆయనకు మద్దతుగా నిలిచారు. ‘సేవ్ సీఐ నాగరాజు’ అంటూ ప్రదర్శనలు కూడా జరిగాయి. ప్రభుత్వం ఒకవైపు చట్టం ప్రకారం ముందుకెళ్తున్నా, క్షేత్రస్థాయిలో రాజకీయ నేతలు ఆయనకు అండగా నిలబడడానికి ప్రధాన కారణం ప్రజల్లో ఉన్న ఈ పాజిటివ్ సెంటిమెంటేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటు బ్యాంకుగా ఉన్న స్థానిక ప్రజలందరూ సీఐ నాగరాజు వైపు మొగ్గు చూపుతుండడంతో, నాయకులు కూడా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లలేక, ఆయనకు నైతిక మద్దతు ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది.
సీఐ నాగరాజుపై 302 (BNS 103) హత్య కేసు నమోదైనప్పటికీ ఆయన అరెస్ట్ ఇంకా కాకపోవడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఉన్నతాధికారులు మరియు సిట్ (SIT) బృందం ఈ కేసులో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేకుండా, పక్కాగా ఆధారాలు సేకరించడానికే సమయం తీసుకుంటున్నట్లు చెప్తున్నా.. తెరవెనుక మాత్రం నాగరాజుకున్న ‘పబ్లిక్ ఇమేజ్’ మరియు స్థానిక మద్దతు వల్ల శాంతిభద్రతల సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ ఆయన్ను అకస్మాత్తుగా అరెస్ట్ చేస్తే కృష్ణలంక ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.








