చికెన్ నెక్ : ఒకప్పుడు 22 కిలోమీటర్ల భయం…ఇప్పుడు భారత్ కు లక్షల కోట్ల భవిష్యత్తు!
— శివ దువ్వూరు
ఆలోచన మారితే సమస్య కూడా అవకాశం అవుతుంది. బలహీనత కూడా బలం అవుతుంది. అడ్డంకి కూడా ఆస్తి అవుతుంది.
ఒకప్పుడు భారతదేశానికి అతిపెద్ద భద్రతా తలనొప్పిగా భావించిన 22 కిలోమీటర్ల “చికెన్ నెక్” ప్రాంతం, ఇప్పుడు వేల కోట్ల పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. నిన్నటి వరకు యుద్ధ సమయంలో ప్రమాదంగా కనిపించిన ఈ సన్నని భూభాగం, నేడు భారత్, జపాన్, బంగ్లాదేశ్‌లను కలిపే భారీ ఆర్థిక కారిడార్‌గా రూపాంతరం చెందుతోంది. ఒక ప్రాంతం మారలేదు… కానీ దాన్ని చూసే దృష్టి మారింది. ఆ దృష్టి మార్పే ఇప్పుడు ఈశాన్య భారత భవిష్యత్తును తిరగరాస్తోంది. అదెలాగో చూద్దాం.
భారత్ మ్యాప్‌ను ఒకసారి ఊహించుకోండి.
మన దేశానికి ఈశాన్య రాష్ట్రాలు అయిన అస్సాం, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఒక మూలలో ఉంటాయి. వాటిని మిగతా భారతదేశంతో కలిపేది కేవలం 22 కిలోమీటర్ల వెడల్పున్న ఒక సన్నని భూభాగం మాత్రమే. దాన్నే “చికెన్ నెక్” అంటారు.
పేరే విచిత్రంగా ఉంటుంది కదా! కోడి మెడ ఎంత సన్నగా ఉంటుందో, ఈ భూభాగం కూడా అంతే సన్నగా ఉండటంతో ఈ పేరు వచ్చింది. అయితే ఈ ప్రాంతంతో ఒకటే భయం. దాన్నే “చికెన్ నెక్” లేదా సిలిగురి కారిడార్ అంటారు.
ఒకే తలుపు… అదే భయం!
ఒక ఇంటికి బయటికి వెళ్లడానికి ఒకే ఒక్క తలుపు ఉందని ఊహించుకోండి. ఆ తలుపు మూసుకుపోతే?లోపలివాళ్లు బయటికి వెళ్లలేరు. బయటివాళ్లు లోపలికి రాలేరు. చికెన్ నెక్ కూడా అలాంటిదే. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు, రోడ్లు, సరుకులు, వ్యాపారం… అన్నీ దాదాపు ఈ మార్గం మీదే ఆధారపడతాయి. అందుకే చాలా ఏళ్లుగా భద్రతా నిపుణులు ఒకే మాట చెప్పేవారు.
“ఇది భారత్‌కు బలహీనమైన పాయింట్” అని. కానీ గేమ్ మారింది! ఇన్నాళ్ళూ భారత్ ఆలోచన ఏమిటంటే… “చికెన్ నెక్‌ను ఎలా కాపాడాలి?”అనే. అయితే ఇప్పుడు ఆలోచన మారింది. “చికెన్ నెక్ మీదే ఎందుకు ఆధారపడాలి?” అనే ప్రశ్న వచ్చింది. అక్కడి నుంచే కొత్త కథ మొదలైంది. అక్కడి నుంచే కొత్త ఆర్థిక వ్యూహం ప్రారంభమైంది.
కొత్త దారి… కొత్త వ్యాపారం!
ఈశాన్య భారతానికి పక్కనే బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్‌కు సముద్ర తీరమూ ఉంది.దీంతో భారత్, జపాన్ కలిసి ఒక కొత్త మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇన్నాళ్లూ ఈశాన్య రాష్ట్రాల్లో తయారయ్యే వస్తువులను వేల కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తరలించి పశ్చిమ బెంగాల్ పోర్టులకు తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వాటిని నేరుగా బంగ్లాదేశ్ మీదుగా సముద్ర తీరానికి తీసుకెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జపాన్ స్పెషల్ ఇంట్రస్ట్ ఏమిటి
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జపాన్ కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉంది. కానీ పరిశ్రమలు పెట్టిన తర్వాత తయారైన వస్తువులను త్వరగా ప్రపంచ మార్కెట్లకు పంపాలంటే ఇబ్బంది వస్తోంది. దాన్ని ఈ మార్గం ద్వారా అధిగమించవచ్చు. అందుకే జపాన్ బంగ్లాదేశ్‌లో మటార్బారి డీప్ సీ పోర్ట్ నిర్మాణానికి భారీగా సహాయం చేస్తోంది.
ఈ పోర్ట్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే పెద్ద పెద్ద కంటెయినర్ నౌకలు నేరుగా అక్కడికి చేరుకోగలవు. ఫలితంగా సరుకు రవాణా వేగంగా జరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపార అవకాశాలు పెరుగుతాయి.
అస్సాంలో చిప్స్… ప్రపంచానికి షిప్స్!
ఈ మార్పును ముందుగానే గుర్తించిన టాటా గ్రూప్ అస్సాంలో భారీ సెమీకండక్టర్ ప్లాంట్ నిర్మిస్తోంది.ఎందుకంటే రేపు అక్కడ తయారయ్యే చిప్స్‌ను ప్రపంచ మార్కెట్లకు పంపడం చాలా సులభం అవుతుంది.
దాంతో జపాన్ లోని చాలా కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడుల కోసం ఆసక్తి చూపుతున్నాయి. ఒకప్పుడు పరిశ్రమలు వెళ్లడానికి వెనుకాడిన ప్రాంతం… ఇప్పుడు పరిశ్రమలు రావడానికి పోటీ పడే ప్రాంతంగా మారుతోంది.
మారింది రోడ్డు కాదు… రాత!
ఇక్కడ అసలు మార్పు రోడ్లలో లేదు. ఆలోచనలో ఉంది. ఒకప్పుడు… “ఈశాన్య భారతాన్ని దేశంతో ఎలా కలపాలి?” అనేది ప్రశ్న. దానికి ఇప్పుడు… “ఈశాన్య భారతాన్ని ప్రపంచంతో ఇలా కలపవచ్చు అనే జవాబు.
గమనిస్తే … చికెన్ నెక్ ఇప్పటికీ అక్కడే ఉంది. దాని భౌగోళిక స్థానంలో ఏ మార్పు లేదు. కానీ దాని గురించి భారత్ ఆలోచించే విధానం మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ప్రమాదంగా కనిపించిన ప్రాంతం ఇప్పుడు అవకాశాల కేంద్రంగా మారుతోంది. ఒకప్పుడు భద్రతా ఆందోళనలకు కారణమైన మార్గం ఇప్పుడు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త ద్వారంగా మారుతోంది.
అందుకే ఈ కథ కేవలం ఒక రహదారి కథ కాదు. ఇది ఒక ప్రాంతం తలరాత మారుతున్న కథ.నిన్నటి “చికెన్ నెక్”… నేటి “ట్రేడ్ ట్రాక్”. నిన్నటి భయం… నేటి భవిష్యత్తు. నిన్నటి అడ్డంకి… నేటి ఆర్థిక అద్భుతం.








