ఐయామ్ ది బాస్.. ఫన్నీకామెంట్ అన్న ట్రంప్..!
జీ-7 వేదికపై ట్రంప్ చేసిన ఐయామ్ ద బాస్ కామెంట్స్.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ప్రపంచదేశాలపై అమెరికా పెత్తనం అంటూ చర్చలు సైతం షురూ అయ్యాయి.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అందరూ దీనిపై స్పందించారు. ఇది సరైన పద్ధతి కాదని, జీ7 దేశాల సదస్సులో అందరి భాగస్వామ్యం ఒకేలా ఉంటుందని.. దీనికి ఎవరూ బాస్ కాదని రాసుకొచ్చారు. అయితే తాజాగా దీనిపై ట్రంప్ స్పందించారు. తాను బాస్‌లా అథారిటీ చూపించాలని ఆ కామెంట్ చేయలేదని.. కేవలం జోక్ మాత్రమే చేశానంటూ వివరించారు. తాను కేవలం సరదాగా అందరినీ నవ్వించడానికే ఆ మాట అన్నానని స్పష్టం చేశారు. ప్రముఖ అంతర్జాతీయ టాక్ షో ‘ది ఆక్సియోస్ షో’ ఇంటర్వ్యూలో ట్రంప్ పాల్గొని.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఆ దౌత్యపరమైన క్షణాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వివరించారు.
అసలు జీ7 సదస్సులో ఏం జరిగిందంటే..?
ఫ్రాన్స్ వేదికగా జరిగిన మూడు రోజుల జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ముగింపు రోజున ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆ రోజు ఉదయం సెషన్‌కు ప్రపంచ దేశాల అధినేతలందరూ అప్పటికే వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. ఆ సమయంలో రూమ్‌లోకి అడుగు పెట్టిన డోనాల్డ్ ట్రంప్.. గంభీరంగా నడుచుకుంటూ వచ్చి, అక్కడున్న నేతలను చూస్తూ “ఐ యామ్ ది బాస్” అంటూ గట్టిగా వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ ఆకస్మిక వ్యాఖ్యతో హాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అక్కడ కూర్చున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సైతం దీనిని చాలా లైట్‌గా తీసుకుంటూ.. నవ్వుతూ మీరు ఎలా ఉన్నారని ట్రంప్‌ను పలకరించారు. దానికి ట్రంప్ కూడా నవ్వుతూ..”గుడ్, థాంక్యూ” అని సమాధానం ఇచ్చారు. అయితే ఈ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవ్వడంతో.. ప్రపంచ దేశాలపై అమెరికా తన పెద్దరికాన్ని చూపిస్తోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు, చర్చలు మొదలయ్యాయి.
ఇంటర్వ్యూలో హోస్ట్ ట్రంప్‌ను ప్రశ్నిస్తూ.. “మీరు రూమ్‌లోకి నడుచుకుంటూ వచ్చి ‘నేనే బాస్‌ను’ అన్నారు కదా. అక్కడున్న వారిలో ఎంతమంది ఆ మాటను నమ్మారు?” అని అడిగారు. దానికి ట్రంప్ స్పందిస్తూ.. “అక్కడున్న వారందరూ నమ్మే ఉంటారు .. కానీ నా ఉద్దేశం అది కాదు. అక్కడ కూర్చున్న వారంతా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వ్యక్తులు, ఆయా దేశాల అత్యున్నత నేతలు. నేను కేవలం వాతావరణాన్ని కాస్త తేలిక పరచడానికి, జోక్ చేయడానికి ఆ మాట అన్నాను. కానీ ఈ చిన్న విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇంతగా ప్రచారం చేస్తారని నేను ఊహించలేదు” అని చెప్పుకొచ్చారు.
ప్రపంచంలోని శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాల కూటమి అయిన జీ7 సదస్సుల నిర్వహణ బాధ్యతను ఆయా దేశాలు వంతు వారీగా తీసుకుంటాయి. గత ఏడాది కెనడా అధ్యక్షతన జరగ్గా.. ఈసారి ఫ్రాన్స్ దీనిని నిర్వహించింది. రాబోయే 2027లో ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. 1975లో ఫ్రాన్స్‌లోని రాంబౌలెట్లో కేవలం 6 దేశాలతో (ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్) ప్రారంభమైన ఈ కూటమి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడానికి ఏర్పడింది. మరుసటి ఏడాది కెనడా చేరడంతో ఇది జీ7 (G7)గా రూపాంతరం చెందింది.








