శాంతి ఒప్పందం బీబీ ముందరి కాళ్లకు బందమా..?
అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రతికూలంగా మారిందా..? ఈ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వార ట్రంప్.. బీబీని కీలుబొమ్మలా మార్చేశారా..? ప్రస్తుతంపరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఒప్పందంలో లెబనాన్ యుద్దం సైతం చేరింది. దీంతో బెంజమిన్ నెతన్యాహు.. అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. ఇప్పటికే ట్రంప్.. నెతన్యాహు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. తాను శాంతి చర్చలకోసం ప్రయత్నాలుచేసిన సమయంలో లెబనాన్ పై దాడులతో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారన్నది ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. తర్వాత ఫోన్ కాల్ లో అదే ప్రస్తావించారు ట్రంప్.
రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధం ద్వారా సాధించాలని ఆయన పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలు ఈ ఒప్పందం కారణంగా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. గత 3 సంవత్సరాలుగా హమాస్, హెజ్బొల్లా, ఇరాన్‌లపై దూకుడైన వ్యూహాన్ని అవలంబిస్తూ సరికొత్తగా పశ్చిమాసియాను నిర్మిస్తానని నెతన్యాహు ప్రతినబూనారు. కానీ గాజాలో హమాస్ ఇంకా ప్రభావం కోల్పోలేదు. లెబనాన్‌లో హెజ్బొల్లా బలంగానే ఉంది. ఇరాన్ పాలక వ్యవస్థ కూలిపోకుండా ఉండటమే కాకుండా.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) మరింత బలపడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్ అంశాన్ని ఒప్పందంలో చేర్చడంద్వారా ఇజ్రాయెల్ సైనిక చర్యలకు పరిమితులు విధించడం నెతన్యాహులో అసంతృప్తికి కారణమైంది.
హర్మూజ్ జల సంధి సంక్షోభంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం, అమెరికాలో పెరిగిన రాజకీయ ఒత్తిడి కారణంగా ట్రంప్ త్వరగా శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశారు. ఈ ప్రక్రియలో ఇజ్రాయెల్‌ను పక్కన పెట్టారనే భావన నెతన్యాహు వర్గాల్లో ఉంది. అక్టోబరు ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు ఆయనకు సవాల్‌గా మారాయి. 2023లో హమాస్ దాడుల భద్రతా వైఫల్యంపై విమర్శలు ఇంకా కొనసాగుతుండగానే, ఇరాన్ యుద్ధం ఆశించిన రాజకీయ లాభాలను ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతలు దీనిని వ్యూహాత్మక వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. అయితే నెతన్యాహు మాత్రం ఇరాన్‌పై చేపట్టిన చర్యలు ఇజ్రాయెల్‌ను అస్తిత్వ ప్రమాదం నుంచి రక్షించాయని చెబుతున్నారు.








