తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు తీరేలా పని చేద్దాం: పవన్ కళ్యాణ్
తెలంగాణ నేల, పోరాటం, త్యాగాలు నాకు స్ఫూర్తినిచ్చాయి, తెలంగాణ గడ్డ నుంచే జనసేన (Janasena) ప్రస్థానం మొదలైంది అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని (Telangana State Office) హైదరాబాద్లోని మణికొండలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలించేలా, ప్రతిబింబించేలా సిద్ధాంతపరమైన భావజాలంతో తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందన్నారు. తెలంగాణలో పార్టీ ప్రయాణం ఎలా ముందుకు సాగించాలనే దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో ప్రజల సమస్యలు వినే ఓపిక అవసరం. ఓ వ్యక్తి తన సమస్యను చెప్పుకునేందుకు మన దగ్గరకు వస్తున్నారంటే వారిని మొదట గౌరవించాలి. వారి సమస్యను సావధానంగా వినాలి. పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పారు. తెలంగాణ దేశానికి గుండెకాయ లాంటిదన్నారు. తెలంగాణలో గొప్ప మేధావులు, పోరాట యోధులు, కవులు, కళాకారులున్నారని, దాశరథి కృష్ణమాచార్యులు, చాకలి ఐలమ్మ (Chakali Ailamma), కాళోజీ, సర్వాయి పాపన్న (Sarvai Papanna) వంటి ఎందరో గొప్పవారు జీవించిన ఈ నేల జనసేన పార్టీకి కీలకం కానుందన్నారు.








