పాపం జైస్వాల్, సెంచరీ చేసినా ఎందుకీ అన్యాయం..?
వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. భవిష్యత్తు వన్డే ప్రణాళికల్లో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఉంటారా లేదా అనే ఊహాగానాలకు తెరదించుతూ సెలెక్టర్లు మరోసారి ఆయనపై నమ్మకం ఉంచారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అయితే, ఈ ఎంపికలో యశస్వి జైస్వాల్‌పై వేటు వేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yasaswi jaiswal) గత మూడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో రెండు అద్భుత సెంచరీలు బాదాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి వన్డేలోనూ 110 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అంతలా ఫామ్‌లో ఉన్నా కూడా ఇంగ్లాండ్ సిరీస్‌కు జైస్వాల్‌ను పక్కన పెట్టడం గమనార్హం. ఇంగ్లాండ్‌పై టాప్ ఆర్డర్లో పెద్దగా ప్రయోగాలు చేయకూడదని భావిస్తున్న సెలెక్టర్లు.. రోహిత్ శర్మతో పాటు గిల్‌ను ఓపెనర్లుగా, విరాట్ కోహ్లీని మూడో స్థానంలో ఆడించాలని ఫిక్స్ అయ్యారు. బ్యాకప్ ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు దూరమైన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే ఆయన ఆడటం అనేది ఫిట్నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడుతున్నప్పుడు హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన కోహ్లీ.. ఈ వారంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. అందులో పాస్ అయితేనే ఆయన తుది జట్టుతో కలిసి ఇంగ్లాండ్ వెళ్తాడు.
భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. అలాగే యువ స్పిన్నర్ హర్ష్ దూబే స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి పునరాగమనం చేశాడు. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అక్షర్, హర్ష్ దూబే ఇద్దరికీ మార్చి మార్చి అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ వన్డే సిరీస్ జూలై 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్ సిరీస్‌కు భారత వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ (ఫిట్నెస్ ఆధారంగా), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.








