ఎపి ప్రగతిలో మీరు భాగస్వాములవ్వాలి… డెట్రాయిట్ అభినందన సభలో జయరాం కోమటి పిలుపు
ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ డెట్రాయిట్ లోని ఫర్మింగ్టన్ హిల్స్ మేనర్ లో జూన్ 19వ తేదీన శుక్రవారంనాడు వైభవంగా జరిగింది. ఎన్నారై టిడిపి డెట్రాయిట్, మిచిగన్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది తెలుగువాళ్ళు, ఎన్నారై టీడిపి నాయకులు, అభిమానులతోపాటు కూటమికి చెందిన జనసేన, బిజెపికి చెందిన నాయకులు, అభిమానులు కూడా హాజరయ్యారు. దాదాపు 200మందికిపైగా ఎన్నారై టీడిపి సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. అటు సంక్షేమంతోపాటు, ఇటు పెట్టుబడులకోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఎన్నారైలు కూడా పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా జయరాం కోమటి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఐటీ, టూరిజం, విద్య, వైద్యరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ఎన్నారైలు తమవంతుగా రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడానికి ఎన్నారైలు తోడ్పాటును అందించాలని కోరారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఎపి ప్రభుత్వానికి తనవంతుగా సహాయసహకారాలు అందించడం వల్ల రాష్ట్రం ఇప్పుటికే వేలాదికోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పారు. మరోవైపు మంత్రి నారా లోకేష్, డిప్యూటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రగతికోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ళ మాట్లాడుతూ, జయరాం కోమటి ఎల్లప్పుడూ ఎన్నారైలకు ఏ సహాయం కావాల్సి వచ్చినా అందించేవారని, మరోవైపు ఎపి ప్రగతికి కూడా ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయనకు ఈ పదవి ఇవ్వడంపట్ల ఎన్నారైలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని గంగాధర్ నాదెళ్ళ ఆధ్వర్యంలో సునీల్ పంట్ర, కిరణ్ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, సురేష్ పుట్టగుంట, వాసు గన్నమనేని, రాంప్రసాద్ చిలుకూరి ఆధ్వర్యంలో జరిపారు.
ఈ కార్యక్రమంలో టీడిపి నాయకులు సతీష్ వేమన, తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, మాజీ అధ్యక్షులు బండ్ల హనుమయ్య, జే తాళ్ళూరితోపాటు పలువురు తానా నాయకులు పాల్గొన్నారు. వీరితోపాటు బిజెపి నాయకులు పాతూరి నాగభూషణం, వాషింగ్టన్ డీసి నుంచి సాయి బొల్లినేని, అనిల్ ఉప్పలపాటి, కెనడా నుంచి లక్ష్మీనారాయణ సూరపనేని, సెయింట్ లాయిస్ నుంచి రాజా సూరపనేని, బే ఏరియా నుంచి శ్రీకాంత్ దొడ్డపనేని, తదితరులు హాజరయ్యారు.








