హారర్ థ్రిల్లర్ ‘అగధ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
నటీనటులు: కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్,
సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి, వైవా రాఘవ తదితరులు నటించారు.
సంగీతం : రాకేష్ వెంకటాపురం, సినిమాటోగ్రఫి: నాని చమిడిశెట్టి,
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
స్క్రీన్‌ప్లే: చైతన్య వేగి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: NVS.సుబ్బరాజు
సమర్పణ: అజయ్ K R, నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
దర్శకత్వం: ఎం.ఎస్.రాజు
విడుదల తేది :14.08.2026
నిడివి : 2 ఘంటల 25 నిముషాలు
మహేష్ తో ఒక్కడు, ప్రభాస్ తో వర్షం, వంటి సినిమాలతో వారిని స్టార్ హీరోలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిలబెట్టిన ఫిలిం మేకర్ ఎం.ఎస్ రాజు, (M.S.Raju) నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నఎం.ఎస్ రాజు ఈ సారి తన సత్తా ఏమిటో నిరుపించుకోడానికి హార్రర్, మిస్టరి థ్రిల్లర్ ‘అగధ’ (AGADHA) చిత్రంతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రచార చిత్రాలతో ఈ సినిమాకు ఎంతో క్రేజ్ వచ్చింది. షుమారు 37 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల,(Kamakshi Bhaskarla) శ్రవణ్ రెడ్డి (Sravan Reddy)జంటగా, దర్శకుడిగా మారిన ఎంఎస్ రాజు ఈ ‘అగధ’తో మ్యాజిక్ చేశాడా? లేదా? ‘అగధ’ సినిమా ప్రేక్షకుడిని ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఎప్పుడూ కూడా దేవీ ఆరాధనలో ఉంటుంది. చుట్టూ ఉండే వారి సమస్యల్ని తీరుస్తూ, ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. అలాంటి మహాదేవి తన కుటుంబానికి కష్టం రావడంతో సొంతూరికి వస్తుంది. మహిమ (ఉల్కా గుప్తా) అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసేలా ఆత్మహత్య చేసుకొంటుంది.ఆమె ఆత్మ ఈ లోకం నుంచి వెళ్లకుండా అక్కడే తిరుగుతుంటుంది. ఆమె గర్భంలోని బిడ్డ కూడా చావడం మహాదేవిని ఆలోచనల్లో పడేస్తుంది. ఈ ఇంటికి ఏదో కీడు జరుగుతోందని మహాదేవి గ్రహిస్తుంది. అదే క్రమంలో తన బాబాయ్(భాను చందర్), పిన్ని సుశీల (వనితా విజయ్ కుమార్) కూతురు హరిణి (జోవికా విజయ్ కుమార్) వింత ప్రవర్తన మరింత అనుమానాన్ని కలిగిస్తుంది. మహిమ ఆత్మ ఘోషను మహాదేవి వింటుంది. మహిమ ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి)లోనూ వింత ప్రవర్తను మహాదేవి కనిపెడుతుంది. మహాదేవీకి ఉన్న శక్తులు ఏమిటి? దుష్ట శక్తులను తరిమికొట్టే శక్తులు మహాదేవీకి ఎలా సంక్రమించాయి? అసలు ఈ వీరంతా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంటారు? మహిమ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? నిషిద్ద గుహలోకి మహిమ, సింహా, బబ్లూ (వైవా రాఘవ) ఎందుకు వెళ్లారు? అసలు సింహా ఎవరు? ఈ అగధ ఎవరు? అగధను చేరుకునేందుకు మహాదేవి గురువు బాబా (షిజు) చేసిన త్యాగం ఏంటి? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
నటీ నటుల హవబవాలు :
ఒక విదంగా ఈ సినిమా భారాన్నంత మహాదేవీ పాత్రతో కామాక్షి భాస్కర్ల మోసిందనే చెప్పాలి. నటనపరంగా పూర్తిగా లీనమై నటించింది. కళ్లతో పలికించిన భావోద్వేగాలు ఆమె టాలెంట్‌కు అద్దం పట్టాయి. యాక్షన్ సీన్లలో కూడా మెప్పించింది. పవర్ఫుల్ రోల్లో ఒదిగిపోయి యాక్టర్‌గా తనలోని మరో కోణాన్ని చూపించారు. ఇక ఈ చిత్రంలో సింహా, సలీం పాత్రల్లో శ్రవణ్ రెడ్డి మరోసారి విభిన్నమైన నటనను ప్రదర్శించారు. కామాక్షితో పోటీపడుతూ నువ్వా నేనా అనే విధంగా నటించారు. హరిణిగా జోవికా ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. భానుచందర్, వనితా విజయ్ కుమార్, ఉల్కా గుప్తా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. షిజుకి కూడా కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లభించింది. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికవర్గం పనితీరు :
టెక్నికల్‌గా చూసుకుంటే.. సెన్సేషనల్ కథలను రాసేందుకు ఇష్టపడే ఒక యువ రచయిత్రి మహాదేవీని వెతుక్కొంటూ వెళ్లడం ద్వారా దర్శకుడు ఎంఎస్ రాజు తన కథను ఆసక్తికరంగా ప్రారంభించారు. ఎంఎస్ రాజు అనుసరించిన స్క్రీన్ ప్లే పక్కాగా కుదరడంతో స్టోరీ గ్రిప్పింగ్‌గా ముందుకెళ్తుంది. మహిమ ఆత్మహత్య తర్వాత నేరుగా కథలోకి వెళ్లి మరింత క్యూరియాసిటీని పెంచేలా సీన్లు, డైలాగ్స్, మూడ్‌ను క్రియేట్ చేయడంలో తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించారనే విషయం స్పష్టమవుతుంది. ఈ సినిమా అసలు హీరోలు మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్. మ్యూజిక్ డైరెక్టర్ రాకేష్ వెంకటాపురం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా మారింది. సెకండాఫ్‌లో తన మ్యూజిక్‌తో సినిమాను థ్రిల్లింగ్‌గా మార్చాడు. అగధ విజువల్స్ బాగుంటాయి. మాటలు అంత గుర్తు పెట్టుకునేలా ఉండవు. చివరగా ‘అగధ’లో బ్లాక్ మ్యాజిక్ ప్రభావవంతంగా అనిపించదు.. తెరపైనా ఎంఎస్ రాజు మ్యాజిక్ కనిపించదు. ఈ సినిమా కోసం వాడుకొన్న కలర్ ప్యాటర్న్.. కథను, సన్నివేశాల మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఆర్ట్ విభాగం పనితీరు హైలెట్. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.
విశ్లేషణ :
మాటల్లో ఎంతో బిల్డప్ ఇచ్చిన అగధ.. చేతల్లో మాత్రం ఏమీ చూపించదు. అగధకి ఇచ్చిన బిల్డప్ చూస్తే సెకండాఫ్ ఓ రేంజ్లో ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది. దైవ శక్తి బలాన్ని సరిగ్గా చూపించలేదు అలానే దుష్ట శక్తి చేసే విధ్వంసం, అరాచకాన్ని కూడా అంత ఎఫెక్టివ్‌గా చూపించలేదు. ఏ సీన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉండదు. పైగా ఇవన్నీ ఇల్లాజికల్‌గా, సిల్లీగానే అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా చాలా వీక్‌గా అనిపిస్తుంది. రెండో పార్ట్ కోసం కథను చాలా వరకు దాచిపెట్టారా? అన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్ల సాగదీసినట్టు.. కథ నత్త నడకగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సన్నివేశాలను రాసుకొన్న విధానం బాగుంది. సెకండాఫ్‌లో యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు చెప్పిన కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది. ఈ సినిమాలో నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ను ఎంఎస్ రాజు రాబట్టుకొన్న విధానం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. క్రైస్తవ, ఇస్లాం మతాల కంటే.. హిందూ మతమే గొప్పది. హిందూ మతంలో ఆచరించే పద్దతులే ఉత్తమం అనే కోణంలో కథను నడించిన తీరు ఆకట్టుకొంటుంది. ఈ సినిమాను ఎంగేజింగ్‌గా చెప్పడానికి ఎంఎస్ రాజు విజన్ బాగా ప్లస్ అయింది. థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ. ఈ వారం మంచి హారర్ థ్రిల్లర్‌ను చూడాలనుకొంటే అగధ మూవీ బెస్ట్ ఆప్షన్.








