‘అబ్జెక్షన్ మై లార్డ్ రివ్యూ’ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : డ్రీం హౌస్,
నటీనటులు: శ్రీకాంత్ మేకా, ముఖేష్ రుషి, అనన్య శర్మ, సమీర్, జెమిని సురేష్, స్నేహల్ కామత్, తదితరులు
సంగీతం: అరుణ్ చిలువేరు, సినిమాటోగ్రఫీ: సూర్య
నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ల
దర్శకత్వం: సంతోష్ అయ్యప్పన్
31.07.2026 నుండి జీ 5 ఓటీటీలో ప్రసారం
30 నిమిషాల నిడివితో 7 ఎపిసోడ్స్
సీనియర్ హీరో శ్రీకాంత్ (Srikanth) ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ (Objection My Lord) ఈ రోజు శుక్రవారం జీ5 (Zee5) ఓటీటీలో రిలీజైంది. ముఖేష్ రిషి, అనన్య శర్మ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందంటే? .
కథ:
పరశురామ్ (శ్రీకాంత్) ఓ లాయర్. చాలా తెలివితేటలు ఉన్నా ఓ కేసులో ఎదురైన ఓటమి కారణంగా కోర్టులో వాదించకూడదని నిర్ణయించుకుంటాడు. న్యాయశాస్త్రంలోని ప్రతి సెక్షన్ గురించి అతడికి అవగాహన ఉంటుంది. ఎంతో టాలెంటెడ్ అయిన పరశురామ్ ఓ సమస్య కారణంగా కోర్టులో వాదనలకు దూరంగా ఉంటాడు. ఫెయిల్యూర్ లాయర్‌గా అవమానాలు పడుతుంటాడు. నోటరీగా చిన్న చిన్న పనులు చేస్తూ అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. చివరకు ఫెయిల్యూర్ లాయర్ అంటూ కన్న కొడుకే పరశురామ్‌ను అవమానిస్తాడు. పరశురామ్ దగ్గర వేద (అనన్య శర్మ) అసిస్టెంట్‌గా జాయిన్ అవుతోంది. నారాయణ అనే వ్యక్తి కోర్టు ముందు ఆత్మాహుతి చేసుకుంటాడు. నారాయణ కేసును పరశురామ్ టేకాప్ చేస్తాడు. నారాయణ కూతురు కూతురు సమీరాను (స్నేహల్ కామత్) ఎవరో కిడ్నాప్ చేశారని, ఆమెను కాపాడాలని పోలీసులతో పాటు లాయర్లను ప్రాధేయపడతాడు నారాయణ. కానీ ఎవరూ అతడి మాటలు పట్టించుకోకపోవడంతో కోర్టు ముందే ఆత్మహత్య చేసుకుంటాడు.అదే టైమ్‌లో పరశురామ్ ఓ మెంటల్ హాస్పిటల్లో పద్దెనిమిదేళ్లు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడనే నిజం కూడా బయటపడుతుంది. ఆ ఆత్మహత్య కేసును పరశురామ్ కోర్టులో వాదించాలని నిర్ణయించుకుంటాడు. అతడికి ప్రత్యర్థిగా కోర్టులో ఫేమస్ లాయర్ విశ్వనాథ్ (ముఖేష్ రిషి)ఉంటాడు.
ఈ కేసు గురించిన ఎంక్వైరీలో నారాయణతో పాటు అతడి కూతురు సమీరా గురించి పరశురామ్, అతడి అసిస్టెంట్ వేదాకు ఎలాంటి నిజాలు తెలిశాయి? సమీరా నిజంగానే కిడ్నాప్ అయ్యిందా? సమీరా కేసుకు ఎమ్మెల్యే కొడుకుతో సంబంధం ఉందా? పరశురామ్‌కు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? లాయర్ వృత్తికి అతడు ఎందుకు దూరమయ్యాడు? సమీరాకు జరిగిన అన్యాయాన్ని పరశురామ్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? ఫేమస్ లాయర్ విశ్వనాథ్‌ను ఏ విధంగా ఓడించాడు? ఈ కేసు ఇన్వేస్టిగేషన్‌లో నారాయణతో పాటు సమీరా గురించి పరశురామ్‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి? తండ్రికి సమీరా ఎలా దూరమైంది? కూతురిని నారాయణ ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నాడు? సమీరాను కిడ్నాప్ చేసింది ఎవరు? ఈ కేసులో పరశురామ్ విన్నర్ అయ్యాడా? అపోజిషన్ లాయర్ విశ్వనాథ్ నుంచి అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అన్నదే అబ్జెక్షన్ మై లార్డ్ అన్నదే ఈ వెబ్ సిరీస్ కథ.
నటీ నటుల హవబవాలు :
నోటరీ పరశురామ్ పాత్రలో శ్రీకాంత్ సెటిల్డ్ యాక్టింగ్‌ను కనరిచాడు. ఫెయిల్యూర్ లాయర్‌గా, ఆడపిల్లకు జరిగిన అన్యాయంపై పోరాడే వ్యక్తిగా డిఫరెంట్ షేడ్స్ తో కూడిన ఎమోషనల్ రోల్‌కు పూర్తిగా న్యాయం చేశారు. ఈ సిరీస్ మొత్తాన్ని వన్ మెన్ ఆర్మీగా తన భుజాలపై నడిపించారు. అపోజిషన్ లాయర్గాముఖేష్ రిషి కనిపించారు. పవర్ఫుల్ అన్నట్లుగా అతడి పాత్రను పరిచయం చేశారు. కానీ ఆయన కోసం రాసిన సీన్లు మాత్రం ఆ స్థాయిలో లేవు. శ్రీకాంత్ అసిస్టెంట్‌గా అనన్య శర్మ నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ కథ మొత్తం సమీరా పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ ఈ క్యారెక్టర్ ఆరో ఎపిసోడ్లో కనిపిస్తుంది. సమీరాగా ఎమోషనల్ రోల్లో స్నేహల్ కామత్ నటన బాగుంది. అవినీతిపరులైన పోలీసులుగా సమీర్, జెమిని సురేష్, స్నేహల్ కామత్, ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు :
అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్‌సిరీస్‌కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించాడు. కోర్టులో వాదనలు అంటేనే భయపడిపోయే నోటరీ లాయర్ మిస్టరీ కేసును ఎలా సాల్వ్ చేశాడనే అంశాలతో కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్‌గా దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించాడు. దర్శకుడిగానే కాకుండా ఈ సిరీస్‌తో రైటర్‌గా సంతోష్ అయ్యప్పన్ మెప్పించాడు. ఎలాంటి సైడ్ ట్రాక్‌లు, డీవీయేషన్లు లేకుండా ప్యూర్ కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్లర్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయి. చివరి వరకు సస్పెన్స్ మెయింటేన్ చేయడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. రాజ్ కుమార్ ఆకేళ్ల ప్రొడక్షన్ వాల్యూస్ ఒకే. అరుణ్ చిలువేరు మ్యూజిక్ బాగుంది. టైటిల్స్ టైమ్‌లో వచ్చే మ్యూజిక్ ఎఫెక్టివ్‌గా అనిపించింది. సినిమాటోగ్రఫీ నార్మల్గాఉంది.
విశ్లేషణ:
శ్రీకాంత్, ముఖేష్ రిషి లాంటి సీనియర్ యాక్టర్లు చేసిన వెబ్‌సిరీస్ కావడం, మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో అబ్జెక్షన్ మై లార్డ్ ఓటీటీ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. ఏదో వెరైటీ కాన్సెప్ట్‌తోనే ఈ సిరీస్ రూపొంది ఉంటుందని అనుకున్నారు. కానీ టైటిల్లో ఉన్న కొత్తదనం సిరీస్‌లో కనిపించలేదు. కోర్టు ముందే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం…కూతురు కనిపించకుండాపోవడం, ఎలాంటి ఆనవాళ్లు లేని కేసు అంటూ ఈ సిరీస్‌ను మొదలుపెట్టిన తీరు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నారాయణ అడ్రెస్ రివీలయ్యే ట్విస్ట్ అదిరిపోతుంది. చిక్కుముడులు విప్పుతూ వెళ్లిన కొద్ది సిరీస్‌లోని ఆసక్తి తగ్గుతూ వచ్చింది. ఆరంభంలో అదరగొట్టిన డైరెక్టర్ చివరలో మాత్రం తేలిపోయారు. హీరో విలన్లు ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులు ఎంత బాగా వర్కవుట్ అయితే కోర్టు రూమ్ సిరీస్‌లు అంతగా ఆకట్టుకుంటాయి. అలాంటి వావ్ మూవ్మెంట్స్ ఒక్కటి కూడా ఈ సిరీస్‌లో కనిపించవు. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఒక్కోటి 30 నిమిషాల వరకు ఉన్నాయి. సమీరా గురించి పరశురామ్, వేదా సాగించే ఇన్వేస్టిగేషన్ ఓ స్టేజ్ తర్వాత బోరింగ్‌గా అనిపిస్తుంది. హీరోకు తగ్గ బలమైన విలన్ లేకపోవడం, ఉన్న పాత్రలను సరిగ్గా రాసుకోకపోవడం మైనస్‌గా మారింది. సమీరా మిస్సింగ్ వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఉన్నట్లుగా చూపించారు. కానీ ఆ ట్రాక్‌లోని ఎమోషన్ అంతగా వర్కవుట్ కాలేదు. ఈ పాయింట్‌తో చాలానే సిరీస్‌లు, సినిమాలు కూడా వచ్చాయి. కోర్టు రూమ్‌లో వాదనల్లో కిక్ మిస్సయ్యింది. క్లైమాక్స్ ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఫైట్ సీన్లు, ఎలివేషన్లు, హీరోయిజం ఛాయలు లేకుండా రియలిస్టిక్ అప్రోచ్‌తో కథను నడిపించడం ఆకట్టుకుంటుంది. కాస్టింగ్ బాగుంది శ్రీ కాంత్ యాక్టింగ్ బాగుంది ఒక సారి చూడొచ్చు.








