రోబోలతో ప్రపంచంపై దండెత్తుతున్న చైనా? పెరుగుతున్న గ్లోబల్ టెన్షన్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మన చేతిలో కనిపించే మొబైల్ ఫోన్ ఏ కంపెనీదని అడిగితే…
చాలామంది దగ్గర Xiaomi, Vivo, Oppo, Realme వంటి చైనా బ్రాండ్లే కనిపించేవి. అలాగే మనం వాడే టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, CCTV కెమెరాలు… ఇంట్లో చుట్టూ చూసినా చైనా ఎలక్ట్రానిక్ వస్తువులే ఎక్కువ.
అది యాదృచ్ఛికంగా జరగలేదు. మంచి నాణ్యత… ప్రత్యర్థుల కంటే తక్కువ ధర… భారీ స్థాయిలో ఉత్పత్తి. ఈ మూడు బలాలతో చైనా ఒక్కో పరిశ్రమను తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
ఇప్పుడు అదే ఫార్ములాతో మరో రంగాన్ని టార్గెట్ చేస్తోంది. అయితే ఈసారి అమ్మేది మొబైల్ కాదు… మనిషిలా పనిచేసే హ్యూమనాయిడ్ రోబోలు.
ఇదే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని ఫ్యాక్టరీల్లో, గిడ్డంగుల్లో, హోటళ్లలో, ఆసుపత్రుల్లో, షాపింగ్ మాల్స్‌లో… చివరికి ఆఫీసుల్లో కూడా “Made in China” అని రాసిన రోబోలే కనిపిస్తాయా?. ఇప్పుడు అమెరికా మాత్రమే కాదు… యూరప్, జపాన్, దక్షిణ కొరియా, ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఇదే ప్రశ్నతో ఆందోళన చెందుతున్నాయి.
గొప్ప స్ట్రాటజీ
చైనా ఇదే పని ఇంతకుముందు కూడా చేసింది. మొదట సోలార్ ప్యానెల్స్‌లో…తర్వాత లిథియం-అయాన్ బ్యాటరీల్లో… ఆ తర్వాత ఎలక్ట్రిక్ కార్లలో… ఇప్పుడు అదే వ్యూహాన్ని రోబోటిక్స్‌లో అమలు చేస్తోందని ప్రపంచం భావిస్తోంది.
అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది?
ఇటీవల అమెరికా కొత్త చైనా హ్యూమనాయిడ్ రోబోల దిగుమతులపై ఆంక్షలు విధించింది. అధికారికంగా కారణం జాతీయ భద్రత అని చెప్పినా… అసలు భయం మాత్రం ఒక్కటే. చైనా మరోసారి మొత్తం ప్రపంచ మార్కెట్‌ను తన చేతుల్లోకి తీసుకెళ్తుందా?
ఈ భయం ఊహ కాదు
2024లో ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాల్ చేసిన ఇండస్ట్రియల్ రోబోట్లలో 54 శాతం చైనాలోనే ఏర్పాటు అయ్యాయి. ఒక్క ఏడాదిలోనే దాదాపు 2.95 లక్షల ఇండస్ట్రియల్ రోబోలను చైనా తన ఫ్యాక్టరీల్లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అక్కడ 20 లక్షలకు పైగా రోబోలు పనిచేస్తున్నాయి.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…
పదేళ్ల క్రితం చైనా మార్కెట్లో విదేశీ కంపెనీలదే ఆధిపత్యం. ఇప్పుడు అక్కడ అమ్ముడవుతున్న ఇండస్ట్రియల్ రోబోట్లలో 57 శాతం చైనా కంపెనీలవే. మనిషిలా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్లలో చైనా దూకుడు మరింత వేగంగా ఉంది.
Barclays అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్లలో 85 శాతం వరకు చైనా కంపెనీలవే.
Interact Analysis ప్రకారం 2025లో ప్రపంచవ్యాప్తంగా షిప్ అయిన హ్యూమనాయిడ్ రోబోట్లలో 90 శాతం వరకు చైనా సంస్థల నుంచే వచ్చాయి.
AgiBot, Unitree, UBTech వంటి చైనా కంపెనీలు వేల సంఖ్యలో రోబోలను మార్కెట్లోకి పంపుతుంటే… టెస్లా, Figure AI వంటి అమెరికా కంపెనీలు మాత్రం కొన్ని వందల యూనిట్లకే పరిమితమయ్యాయి.
ఎందుకంత చవకగా అమ్మగలుగుతోంది?
చైనా ప్రపంచంలోనే అత్యంత తెలివైన రోబోను తయారు చేస్తోందని కాదు… ప్రపంచంలోనే అత్యంత చవకగా తయారు చేయగలుగుతోంది. అదే ఈ కథలో అసలు ట్విస్ట్. అందుకు కారణం రోబో తయారీకి అవసరమైన బ్యాటరీలు, మోటార్లు, సెన్సార్లు, కెమెరాలు, పవర్ ఎలక్ట్రానిక్స్, ప్రెసిషన్ పార్ట్స్… దాదాపు మొత్తం సరఫరా వ్యవస్థ చైనా దేశంలోనే ఉంది. స్మార్ట్ఫోన్లు, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిర్మించిన భారీ తయారీ వ్యవస్థనే ఇప్పుడు రోబోటిక్స్‌కు ఉపయోగిస్తోంది. అందుకే మిగతా దేశాల కంపెనీలు పోటీ పడలేనంత తక్కువ ధరకు భారీ స్థాయిలో రోబోలను తయారు చేయగలుగుతోంది.
ప్రపంచం అంతా భయపడుతున్న అసలు కారణం వేరే
చైనా ఇప్పుడు పరిశోధనలో కూడా వేగంగా ముందుకు వెళ్తోంది. దేశంలో ఇప్పటికే 140కి పైగా హ్యూమనాయిడ్ రోబో తయారీ సంస్థలు ఉన్నాయి. LexisNexis విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన పేటెంట్ పోర్ట్‌ఫోలియో కలిగిన టాప్-10 హ్యూమనాయిడ్ రోబో స్టార్టప్‌లలో ఆరు చైనా కంపెనీలే. అందులో మొదటి ఐదు స్థానాలు కూడా చైనా సంస్థలకే దక్కాయి.
లాభాలు… నష్టాలు రెండూ ఉన్నాయి
చవక ధరలో రోబోలు అందుబాటులోకి వస్తే పరిశ్రమల ఉత్పాదకత పెరుగుతుంది. చిన్న కంపెనీలకు కూడా ఆటోమేషన్ సాధ్యమవుతుంది. ప్రమాదకరమైన పనుల్లో మనుషుల బదులుగా రోబోలను ఉపయోగించవచ్చు.
అదే సమయంలో తయారీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్, రిటైల్ వంటి రంగాల్లో తక్కువ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలపై ఒత్తిడి పెరగొచ్చు. ఒకసారి ప్రపంచం మొత్తం చైనా రోబోలపై ఆధారపడితే, అన్ని విషయాల్లోనూ ఒకే దేశం ప్రభావం పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా ఉంది.
అసలు ఛాలెంజ్ ఇక్కడే
అయితే పోటీ ఇంకా ముగియలేదు. అమెరికా కృత్రిమ మేధస్సులో బలంగా ఉంది. జపాన్, దక్షిణ కొరియా, యూరప్ కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ భారీ ఉత్పత్తి, తక్కువ ధర, వేగవంతమైన తయారీ సామర్థ్యం అనే మూడు ఆయుధాలతో చైనా మరోసారి ప్రపంచ మార్కెట్‌ను సవాల్ చేస్తోంది.
కంక్లూజన్ ఇంకా దొరకలేదు
ఇవన్నీ చూస్తూంటే… రేపు… ప్రపంచంలో ఎక్కడ చూసినా “Made in China” అని రాసిన మనిషిలా కనిపించే రోబోలే కనిపిస్తాయా? అనే ప్రశ్న అందరినీ భయపెడుతోంది. ఇప్పుడు అమెరికా మాత్రమే కాదు… ప్రపంచమంతా అదే ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది.








