AI కూడా గవర్నమెంట్ ఉద్యోగిలా మారిందేంటి? ఎందుకీ సెటైర్లు?
ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్తే… “ఆ ఫైల్ చూడండి”, “ఈ ఆఫీస్‌కి వెళ్లండి”, “ఆ డాక్యుమెంట్ తీసుకురండి” అనే సమాధానాలు వినిపించేవి. ఇప్పుటికీ చాలా చోట్ల అదే జరుగుతున్నా పద్దతులు మారాయి. దీనికి అంతమే లేదా అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి అడుగుపెట్టింది. మనుషుల్లా మాట్లాడే AI వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అదే టెక్నాలజీ అడుగుపెట్టింది.
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… మాట్లాడేది AI అయినా, చెప్పేది మాత్రం అదే పాత ప్రభుత్వ భాష. ఇప్పుడు అదే ప్రశ్నను AIని అడిగినా… “ఈ PDF చూడండి”..”ఆ లింక్ ఓపెన్ చేయండి…, “ఇంకో వెబ్‌సైట్‌కు వెళ్లండి…” అనే సమాధానమే వస్తోంది. అంటే AI ప్రభుత్వంలో పనిచేయడం నేర్చుకుందా… లేక ప్రభుత్వ వ్యవస్థే AIని తనలాగే మార్చేసిందా?. ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో ఇదే ప్రశ్న పెద్ద చర్చగా మారుతోంది.
AI కాదు… అసలు సమస్య వేరే ఉంది!
భారత్‌లో ప్రభుత్వ శాఖల్లో AI వినియోగాన్ని వేగంగా పెంచేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరు కంపెనీలను ఎంపిక చేసింది. ప్రభుత్వ విభాగాలకు AI ఆధారిత కో-పైలట్లు, చాట్బాట్లు, స్మార్ట్ అసిస్టెంట్లను రూపొందించే బాధ్యత వీరికే అప్పగించింది.
వినడానికి ఇది భారీ డిజిటల్ విప్లవంలా అనిపిస్తుంది. కానీ టెక్ నిపుణులు మాత్రం అసలు సమస్య AIలో కాదని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఫైళ్లు, అసంపూర్ణమైన డేటా, వేర్వేరు శాఖల్లో వేర్వేరు రికార్డులు, సమన్వయం లేని సమాచారమే AIని కూడా గందరగోళంలో పడేస్తోందని అంటున్నారు.
ఒక ప్రశ్న… మూడు పనికిరాని సమాధానాలు!
ప్రభుత్వం రూపొందించిన AskSarkar చాట్‌బాట్‌ను పరిశీలించిన నిపుణులు కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూపిస్తున్నారు.
“నేను ఒక స్టార్టప్ ప్రారంభించాలనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు ఉన్నాయి?” అని అడిగితే… స్టార్టప్‌లకు సంబంధించిన సమాచారానికి బదులు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి సంబంధం లేని పథకాల జాబితా చూపిస్తోందని చెబుతున్నారు.
AI పాలసీ గురించి అడిగితే కూడా నేరుగా సమాధానం చెప్పకుండా 170 పేజీల PDF, మరికొన్ని వెబ్సైట్ లింకులు మాత్రమే ఇస్తోందని విమర్శిస్తున్నారు. సాధారణ పౌరుడికి కావాల్సింది ఒక స్పష్టమైన సమాధానం. కానీ AI చేతిలో కూడా చివరకు ఫైల్, PDF, లింకులే మిగులుతున్నాయని టెక్ నిపుణులు అంటున్నారు.
రైల్వే శాఖలోనూ ఇదే పరిస్దితి!
రైల్వే శాఖ రూపొందించిన AskDisha చాట్‌బాట్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉందని నిపుణులు చెబుతున్నారు. టికెట్ బుక్ చేయమని అడిగితే, AI మొత్తం ప్రక్రియ పూర్తి చేయకుండా చివరకు IRCTC వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ మళ్లీ వినియోగదారే అన్ని వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే AI ముందు నిలబడి ఉన్నా, లోపల పని మాత్రం పాత వ్యవస్థే చేస్తోందన్న మాట.
ఆరు కంపెనీలు… కానీ అసలు పరీక్ష ఇప్పుడే
ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీలు ప్రపంచ స్థాయి AI టెక్నాలజీని తీసుకురాగలవు. అత్యాధునిక కో-పైలట్లు, స్మార్ట్ చాట్బాట్లు కూడా అభివృద్ధి చేయగలవు. కానీ AIకి అందించే సమాచారం గందరగోళంగా ఉంటే, దాని సమాధానం కూడా గందరగోళంగానే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI ఎంత తెలివైనదైనా, అది పనిచేసేది చివరకు డేటాపైనే అనేది మర్చిపోకూడదని చెప్తున్నారు.
50 ఏళ్ల ఫైళ్ల బరువు
భారత ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమాచారం ఒకే విధంగా లేదు. కొన్ని రికార్డులు డిజిటల్లో ఉన్నాయి. మరికొన్ని ఇప్పటికీ పాత ఫైళ్లలోనే ఉన్నాయి. కొన్ని శాఖల్లో అప్డేట్ అయిన సమాచారం ఉంటే, ఇంకొన్ని చోట్ల పాత వివరాలే కొనసాగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో AIకి పూర్తి సమాచారం దొరకదు. అందుకే కొన్ని ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు, మరికొన్ని ప్రశ్నలకు అసంపూర్ణమైన సమాచారం వస్తోంది.
ప్రతి శాఖ… తనదే రాజ్యం!
ఇంకో పెద్ద సమస్య ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే. ఒక శాఖ దగ్గర ఉన్న సమాచారం మరో శాఖకు అందుబాటులో ఉండదు. ఒకే పనిని వేర్వేరు శాఖలు మళ్లీ మళ్లీ చేస్తుంటాయి. ప్రతి శాఖ తనకంటూ ప్రత్యేక డేటాబేస్ నిర్వహిస్తుంది.
దీని వల్ల AIకి ఒకే చోట పూర్తి సమాచారం కనిపించదు. చివరకు అది కూడా ఒక శాఖ చెప్పినదే మరో పౌరుడికి సమాధానంగా అందించే పరిస్థితి వస్తోంది.
AIని కాదు… ముందుగా వ్యవస్థను అప్డేట్ చేయాలి
AI ఎంత శక్తివంతమైన టెక్నాలజీ అయినా, దానికి అందించే సమాచారం తప్పైతే అది కూడా తప్పే చెబుతుంది. ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని ఒకే విధంగా డిజిటలైజ్ చేయడం, పాత రికార్డులను శుభ్రపరచడం, అన్ని శాఖల మధ్య డేటా అనుసంధానం కల్పించడం, నిరంతరం అప్డేట్ చేయడం జరిగితేనే AI నిజమైన ఫలితాలు ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు.
లేకపోతే కోట్ల రూపాయలతో రూపొందించిన అత్యాధునిక AI వ్యవస్థలు కూడా చివరకు “ఈ PDF చూడండి”, “ఆ లింక్ ఓపెన్ చేయండి” అని చెప్పే మరో డిజిటల్ ప్రభుత్వ కార్యాలయంగానే మిగిలిపోతాయి.
ఫైనల్ గా..
AI వేగంగా ఆలోచిస్తుంది. కానీ ప్రభుత్వ వ్యవస్థ నెమ్మదిగా కదులుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించకపోతే, AI ప్రజల సమయాన్ని ఆదా చేసే టెక్నాలజీగా మారదు. కేవలం పాత ప్రభుత్వ సేవలకు కొత్త ఇంటర్ఫేస్గా మాత్రమే మిగిలిపోతుంది.
అసలు డిజిటల్ విప్లవం AIతో మొదలుకాదు… ప్రభుత్వ డేటా, ప్రభుత్వ వ్యవస్థ మారిన రోజే మొదలవుతుంది.








