తల్లి ప్రేమ, జ్ఞాపకాలు, AI… మూడింటి మధ్య నడిచే సైన్స్ ఫిక్షన్
—సూర్య ప్రకాష్ జోశ్యుల
డోర్‌బెల్ శబ్దం విని తలుపు తీసిన ఆ తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యంలో ఉండిపోయింది. నోటి మాట రాలేదు.ఎందుకంటే ఎదురుగా నిలబడి ఉన్నది…తానే స్వయంగా అంత్యక్రియలు చేసిన తన ఏడేళ్ల కొడుకు.
అచ్చం అదే ముఖం… అదే చిలిపి నవ్వు… అదే “అమ్మా!” అని పిలిచే గొంతు. కానీ వాడి గుండె కొట్టుకోవడం లేదు. వాడి ఛాతీలో కొట్టుకుంటోంది ఒక ప్రాసెసర్. ఆమె కడుపున పుట్టిన కొడుకు పాత ఫొటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్‌ను డేటాగా మార్చి… ఒక కంపెనీ తయారు చేసి పంపిన AI రోబో.
కంగారుపడకండి..ఇదేమీ జరగలేదు.ఇది రీసెంట్ గా రిలీజైన ‘Sheep in the Box’అనే జపనీస్ సినిమాలోని కీలకమైన సీన్. జపాన్ దర్శకుడు హిరోకాజు కొరె-ఎడా తెరకెక్కించిన ఈ సినిమా గురించే అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి సినిమా పెద్దగా భాక్సాపీస్ విన్నర్ కాదు..యావరేజే. కానీ ఈ కాన్సెప్టు మాత్రం అక్కడ మీడియా లోనే కాదు,సోషల్ మీడియాలోనూ డిస్కషన్ గా మారింది.
పైకి చూడ్డానికి ఇది ఒక కుటుంబం విషాదగాథలా కనిపించినా, సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ఇది AIతో మడిపడుతున్న మనిషి దుఃఖం, జ్ఞాపకాలు, ప్రేమ గురించి మాట్లాడే కథగా మారిపోతుంది.
ఇంతకీ కథేంటి
కథ సమీప భవిష్యత్తులోని ఒక జపనీస్ తీరప్రాంత పట్టణంలో సాగుతుంది. ఒటోన్ (హరుకా అయాసే) ఒక ఆర్కిటెక్ట్ కాగా, ఆమె భర్త కేన్సుకె (దైగో యమమోటో) కార్పెంటరీ/ఇంటి నిర్మాణ సంస్థను నడుపుతుంటాడు. రెండేళ్ల క్రితం ఒక ప్రమాదంలో వాళ్ళ 7 ఏళ్ల కొడుకు కేకేరు చనిపోతాడు. ఆ బాధ నుంచి వారు బయటపడలేక, నిశ్శబ్దంగా నరకం అనుభవిస్తుంటారు.
ఏఐ రోబో రాక
‘రీబర్త్’ (REbirth) అనే కంపెనీ, చనిపోయిన పిల్లాడి పాత ఫొటోలు, వీడియోలను డేటాగా వాడి, జెనెరేటివ్ ఏఐ సాయంతో కేకేరు లాగే ఉండే కేకేరు 2.0 అనే రోబో బాబును రూపొందిస్తుంది. ఉచిత ట్రయల్‌లో భాగంగా ఆ రోబోను డ్రోన్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపుతారు. భర్త “ఇది మనుషుల బాధను వ్యాపారం చేసుకోవడమే” అని అసహ్యించుకుంటాడు.భార్య మాత్రం కొడుకుపై ఉన్న ప్రేమతో ఆ రోబోను కొడుకులాగే స్వీకరిస్తుంది.
రోబోతో జీవితం & కొత్త కోణం:
నెమ్మదిగా కొంతకాలానికి భర్త కూడా ఆ రోబో బాబుకు దగ్గరవుతాడు. కేకేరు 2.0 కేవలం చనిపోయిన పిల్లాడి కు డూప్లికేట్ గానే కాకుండా, తనకంటూ సొంత ఆలోచనా ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవటం మొదలెడతాడు. చుట్టు ప్రక్కల ఉన్న ప్రతీది తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచుకుంటుందా బేబీ రోబో. తల్లిదండ్రుల వృత్తులైన ఆర్కిటెక్చర్, కలప/చెట్ల గురించి ఆసక్తి చూపిస్తుంది.
ఆ క్రమంలో రోబో బాబు కేకేరు 2.0 క్రమంగా తనకంటూ సొంత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కోరుకుంటుంది.తల్లి,తండ్రులను ఏక్సెప్టు చేయలేకపోతుంది. దాంతో ఆ బేబి రోబో ద్వారా తమ కొడుకు తిరిగి రాలేడని, చనిపోయిన వారి జ్ఞాపకాలను వదిలేసి ముందుకు సాగడమే జీవితమని ఆ తల్లిదండ్రులు ఎలా గ్రహించారు? ఏఐ బాబు తన సొంత ఉనికిని ఎలా చాటుకున్నాడు? అనే అంశంతో కథ ముగుస్తుంది.
టైటిల్ అర్దం
ఈ సినిమా టైటిల్ ‘ది లిటిల్ ప్రిన్స్’ అనే ప్రముఖ పుస్తకం ఆధారంగా పెట్టబడింది. ఆ పుస్తకంలో ఉన్న కథలో పెట్టెలో ఉన్న గొర్రెను బయట నుంచి చూడలేనట్లే, ఈ ఏఐ బాబు లోపల ఉన్న భావాలు, మనస్సు నిజమైనవా కావా అనేది ఎవరికీ తెలియదు అనే Metaphorical స్టైల్ లో ఈ టైటిల్ పెట్టారు.
ఈ సినిమా ప్రత్యేకత కథా ట్విస్ట్ లో లేదు. అడిగే ప్రశ్నల్లో ఉంది.
ఇప్పటికే AI మన గొంతును అనుకరిస్తోంది. మన ఫొటోలతో వీడియోలు తయారు చేస్తోంది. చనిపోయిన వ్యక్తుల డిజిటల్ రూపాలను సృష్టించే టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో “మనం కోల్పోయిన వారిని AI రూపంలో తిరిగి తీసుకొస్తే?” అనే ప్రశ్నను తెరపైకి తీసుకురావడం వల్ల ‘Sheep in the Box’ ఒక సాధారణ సైన్స్ ఫిక్షన్ సినిమాగా కాకుండా, నేటి ప్రపంచానికి దగ్గరగా అనిపించే కథగా నిలుస్తుంది.అందుకే డిస్కషన్ జరుగుతోంది.
ప్రపంచ సినిమా కూడా మారుతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే భవిష్యత్తు యంత్రాలు, గ్రహాంతరవాసులు, భారీ యాక్షన్ గుర్తొచ్చేవి. ఇప్పుడు అదే సైన్స్ ఫిక్షన్ మన ఇళ్లలోకి వచ్చింది. AI మన సంబంధాలను, మన జ్ఞాపకాలను, మన దుఃఖాన్ని ఎలా మార్చబోతోందనే ప్రశ్నలే కొత్త కథలకు ఆధారంగా మారుతున్నాయి. ‘Sheep in the Box’ ఆ మార్పుకు మంచి ఉదాహరణ.
ఏదైమైనా…
టెక్నాలజీ ఒక రోజు మన రూపాన్ని, మన గొంతును, మన జ్ఞాపకాలను తిరిగి సృష్టించగలదేమో. కానీ… మనం కోల్పోయిన మనిషినే నిజంగా తిరిగి తీసుకురాగలదా?. ఇదే ప్రశ్నని రాబోయే కాలంలో ప్రపంచ సినిమా మరింత ఎక్కువగా అడగబోతోందనిపిస్తోంది.








