హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తప్పించండి.. హైకోర్టు ఆదేశం!
హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల చెర నుంచి విముక్తి చేస్తామంటూ అట్టహాసంగా దూసుకొచ్చిన ‘హైడ్రా’ బుల్డోజర్లకు ఉన్నత న్యాయస్థానం గట్టి బ్రేక్ వేసింది. ప్రజాదరణ, ఆవేశం ఎంత ఉన్నా చట్టం, రాజ్యాంగ నియమాలను దాటి వ్యవహరిస్తే సహించేది లేదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాదాస్పద కూల్చివేతలు, కోర్టు ఆదేశాల ధిక్కరణ ఆరోపణల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించి, ఆయన స్థానంలో ఐజీ స్థాయి కలిగిన మరొక ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడింది.
మల్కాజ్గిరి మండలం లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2 పరిధిలో ఉన్న 40 ఎకరాల భూవివాదంలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ కూల్చివేతలకు పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఒక ప్రభుత్వ జీవో ఆధారంగా ఏర్పడిన ఏజెన్సీ, పౌర హక్కులను పరిరక్షించే సివిల్ కోర్టులు, హైకోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కూడా పక్కనపెట్టి చర్యలు చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని తేల్చిచెప్పింది.
ఒకే ఒక్క అధికారిపై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం సాధారణ విషయం కాదని, ఇది వ్యవస్థల తీరుపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కళ్లు మూసుకుని ఒకే ఏజెన్సీ నిర్ణయాల వెనుక నడవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తూ బేషరుతుగా క్షమాపణ కోరారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని, న్యాయస్థానాల ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. పిటిషనర్ పేర్కొన్న వివాదాస్పద 40 ఎకరాల స్థలంలోకి తాము ప్రవేశించలేదని, వాస్తవాలను దాచి కోర్టును తప్పుదోవ పట్టించారని తన రక్షణగా నివేదించారు.
ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తూ, చెరువులను పునరుద్ధరించాలనే హైడ్రా ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, అనుసరించే పద్ధతి మాత్రం కచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే ఉండాలని కోర్టు హితవు పలికింది. మంచి లక్ష్యం కోసం చెడు మార్గాన్ని ఎంచుకోవడం సమర్థనీయం కాదని తేల్చిచెప్పింది. వ్యవస్థలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే ఐజీ స్థాయి అధికారికి నేతృత్వాన్ని అప్పగించడమే సరైన చర్య అని అభిప్రాయపడింది.
ఈ తీర్పు పరిపాలనా, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్నారన్న పేరుతో ప్రశంసలు పొందినప్పటికీ, చట్టబద్ధమైన ప్రక్రియను పక్కనపెట్టడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన చాటిచెప్పింది. ప్రభుత్వ యంత్రాంగాలు లేదా దర్యాప్తు సంస్థలు ఎంతటి తీవ్రమైన చర్యలు చేపట్టినా, కోర్టుల ముందస్తు అనుమతులు, చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఈ సంచలన తీర్పు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.








