నిజం! మన BSc డిగ్రీకి అమెరికాలో భారీ డిమాండ్… లక్షల్లో జీతం!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
“నాన్నా… ఇంజినీరింగ్ చదివిస్తే బాగుండేది కదా…”
డిగ్రీ పూర్తయ్యాక కొడుకు అడిగిన ఆ ఒక్క మాటకు… ఆ తండ్రి దగ్గర సమాధానం లేదు.
ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఖరీదైన కోర్సులు చదివించే స్థోమత ఆ కుటుంబానికి లేదు. అందుకే తన వల్లైనంత చేసి BScలో చేర్పించాడు.”ఏదో ఒక డిగ్రీ ఉంటే… జీవితంలో నిలబడతాడు.” అదే ఆయన నమ్మకం.
మూడేళ్లు గడిచాయి. చేతిలో డిగ్రీ ఉంది. కానీ ఉద్యోగం మాత్రం నెలకు ₹15 వేల జీతంతో మొదలైంది. ఆ జీతం చూసిన రోజు… ఆ కుర్రాడికంటే అతని తండ్రే ఎక్కువ బాధపడ్డాడు. “ఇంత కష్టపడి చదివించింది ఇందుకోసమేనా?” అనే ప్రశ్న ఇంట్లో ఎవ్వరూ బయటకు చెప్పలేదు. కానీ అందరి మనసులో ఉంది.
అప్పటికే ప్రపంచమంతా మరో చర్చలో మునిగిపోయింది. “AI వస్తోంది… లక్షల ఉద్యోగాలు పోతాయి!”. కెరీర్ మొదలుపెడుతున్న ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాళ్ళందికి ఉన్న భయమే అతనికీ ఉంది. “ఇప్పుడు వచ్చిన ఈ ఉద్యోగమే రేపు లేకపోతే,AI లాక్కుపోతే?” కానీ… అతనికి తెలియకుండా మరో అవకాశం అతని కోసం సిద్ధమవుతోంది.
అమెరికా ఆరోగ్య రంగం… ఇంజినీర్ల కోసం కాదు, డాక్టర్ల కోసం కాదు… అతని లాంటి వేలాది మంది సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. మన దగ్గర చాలామంది పెద్దగా పట్టించుకోని BSc డిగ్రీ… అమెరికాలో లక్షల రూపాయల కెరీర్‌కు పునాది ఎలా అయింది? ఆ ప్రశ్నకు సమాధానం… ఆ కుర్రాడి ప్రయాణంలోనే ఉంది.
₹15 వేల ఉద్యోగం నుంచి… అమెరికా హాస్పిటళ్లకు కీలక వ్యక్తిగా!
ఆ రోజు తన భవిష్యత్తు ఇక్కడితో ఆగిపోయిందనుకున్న ఆ కుర్రాడి జీవితం… కొన్నేళ్లలో పూర్తిగా మారిపోయింది. అలాగని ఈ రోజు అతను అమెరికాలో లేడు. హైదరాబాద్‌లోనే ఉన్నాడు. కానీ ప్రతిరోజూ ఉదయం అతని ల్యాప్‌టాప్ తెరిస్తే… స్క్రీన్‌పై కనిపించేవి అమెరికాలోని ప్రముఖ హాస్పిటళ్ల పేషెంట్ ఫైల్స్.
రోజూ అలాంటి ఫైల్‌ను పరిశీలించటం, డాక్టర్ నమోదు చేసిన చికిత్స వివరాలకు సిస్టమ్‌లో ఉన్న మెడికల్ కోడ్ సరిపోవడం లేదనిపిస్తే గుర్తించటం అతని పని. ఈ పని హాస్పిటల్లకు బాగా కీలకం. చిన్న పొరపాటు జరిగినా ఆ హాస్పిటల్‌కు వేల డాలర్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిలిచిపోయే అవకాశం ఉంది. అలాంటివి వెంటనే సరిచేయాలి. కొన్ని నిమిషాల పని.కానీ హాస్పిటల్‌కు పెద్ద నష్టం తప్పుతుంది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…ఆ పని చేసే వ్యక్తి డాక్టర్ కాదు.అమెరికాలో కూడా ఉండడు. హైదరాబాద్‌లో కూర్చున్న ఒక సాధారణ BSc గ్రాడ్యుయేట్.
మూడేళ్ల క్రితం ₹15 వేల ఉద్యోగంతో కెరీర్ మొదలుపెట్టిన చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇప్పుడు అమెరికా ఆరోగ్య వ్యవస్థలో సీనియర్ మెడికల్ కోడర్‌గా, టీమ్ లీడ్‌గా పనిచేస్తూ ఏడాదికి రూ.22 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.
అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏమిటి?
అమెరికాలో ఒక పేషెంట్ హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు డాక్టర్ చికిత్స చేయడం ఒక్కటే సరిపోదు. ఆ చికిత్సకు సంబంధించిన ప్రతి పరీక్ష, ప్రతి ప్రొసీజర్, ప్రతి మందు… అన్నింటినీ ఇన్సూరెన్స్ కంపెనీలు అర్థం చేసుకునే ప్రామాణిక మెడికల్ కోడ్లుగా మార్చాలి. ఈ ప్రక్రియనే Medical Coding అంటారు.
ఈ మొత్తం బిల్లింగ్, క్లెయిమ్స్, పేమెంట్స్ వ్యవస్థను నిర్వహించే ప్రక్రియను Revenue Cycle Management (RCM) అని పిలుస్తారు. పేరు వినడానికి చిన్న పని అనిపించినా… అమెరికా ఆరోగ్య వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైన బాధ్యత. ఒక్క కోడ్ తప్పినా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. దాంతో హాస్పిటల్‌కు భారీ నష్టం వస్తుంది. అందుకే ఈ పనిని ఖచ్చితత్వంతో చేయగల నిపుణులకు అక్కడ భారీ డిమాండ్ ఉంది.
AI ఆగిపోయిన చోట… ఈ కెరీర్ మొదలవుతోంది
AI గురించి ప్రపంచమంతా మాట్లాడుతోంది. చాట్‌జీపీటీ విశ్లేషిస్తుంది. అధునాతన AI సిస్టమ్‌లు డేటాను ప్రాసెస్ చేస్తాయి. అయితే అమెరికా హాస్పిటల్ బిల్లును చివరిసారి పరిశీలించి ఆమోదించే బాధ్యత మాత్రం ఇప్పటికీ మనుషులదే. ఎందుకంటే…AI ఒక చిన్న పొరపాటు చేసినా అది కేవలం సాఫ్ట్వేర్ తప్పు కాదు. వేల డాలర్ల క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం. అందుకే AI ఈ రంగంలో సహాయకుడిగా ఉన్నా… తుది నిర్ణయం తీసేది శిక్షణ పొందిన మెడికల్ కోడరే.
రోజంతా ఏం చేస్తారు?
ఉదయం లాగిన్ అయిన వెంటనే అమెరికా హాస్పిటళ్ల నుంచి వచ్చిన కేసులు సిస్టమ్‌లో కనిపిస్తాయి. డాక్టర్లు నమోదు చేసిన వివరాలను పరిశీలిస్తారు. వాటికి సరిపోయే మెడికల్ కోడ్లను కేటాయిస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకుంటారు. క్వాలిటీ చెక్ పూర్తయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ అమెరికాకు పంపిస్తారు. చూడటానికి సాధారణంగా అనిపించినా… ప్రతి కేసు వెనుక ఖచ్చితత్వం, బాధ్యత రెండూ సమానంగా అవసరం.
ఈ ఉద్యోగం గురించి ఎక్కువ మంది నమ్మే అపోహలు
చాలామంది ఇప్పటికీ ఇది డాక్టర్ల ఉద్యోగమే అనుకుంటారు.
కానీ అది నిజం కాదు.
Life Sciences, Zoology, Biotechnology, Microbiology, Chemistryతో పాటు B.Pharmacy, Nursing, Physiotherapy వంటి కోర్సులు చదివినవాళ్లు కూడా ఈ రంగంలోకి రావచ్చు.
ఇంకో అపోహ… ఈ ఉద్యోగం చేయాలంటే అమెరికాకు వెళ్లాలనేది.
వాస్తవానికి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాల్లో కూర్చొనే వేలాది మంది భారతీయులు అమెరికా హాస్పిటళ్లకు సేవలందిస్తున్నారు.
చాలా సంస్థలు Work From Home అవకాశాలు కూడా ఇస్తున్నాయి.
అలాగే Software Coding రావాలని కూడా చాలామంది అనుకుంటారు. కానీ Medical Codingకి, Software Codingకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ అవసరమయ్యేది… మెడికల్ టెర్మినాలజీపై అవగాహన, పరిశీలనా నైపుణ్యం, నేర్చుకోవాలనే ఆసక్తి.
జీతాలు ఎలా ఉంటాయి?
ఫ్రెషర్‌గా చేరినప్పుడు నెలకు ₹25 వేల నుంచి ₹30 వేల వరకు జీతం లభిస్తుంది. అనుభవం పెరిగే కొద్దీ Senior Medical Coder, Quality Analyst, Team Lead, Operations Manager వంటి బాధ్యతల్లోకి ఎదిగే అవకాశం ఉంటుంది.
మూడు నుంచి ఐదేళ్ల అనుభవం తర్వాత ఏడాదికి ₹15 లక్షల నుంచి ₹22 లక్షలకుపైగా ప్యాకేజీలు అందుకుంటున్నవాళ్లు ఈ రంగంలో చాలామంది ఉన్నారు.
మన దగ్గరే అవకాశాలు ఉన్నాయి
తెలుగు రాష్ట్రాల్లో IKS Health, Omega Healthcare, Access Healthcare, CorroHealth, GeBBS Healthcare వంటి ప్రముఖ సంస్థలు ఈ రంగంలో నిరంతరం నియామకాలు చేపడుతున్నాయి. AAPC నిర్వహించే CPC Certification ఉంటే అవకాశాలు మరింత మెరుగవుతాయి. కొన్ని కంపెనీలు ఫ్రెషర్స్‌కు శిక్షణ ఇచ్చి కూడా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.
చివరికి… ఆ తండ్రికి సమాధానం దొరికింది
ఒకప్పుడు…”BSc చేశాడా?” అని జాలి పడిన బంధువులే…ఈ రోజు…”ఏ కంపెనీలో చేస్తున్నావు?” అని అడుగుతున్నారు. జీవితాన్ని మార్చేది ప్రతి సారి ఖరీదైన డిగ్రీ కాదు. సమయానికి దొరికే సరైన అవకాశం కూడా కావచ్చు. మెడికల్ కోడింగ్… అలాంటి అవకాశాల్లో ఒకటి. అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే… అమెరికా ఆరోగ్య వ్యవస్థలో భాగమయ్యే అవకాశం ఈ రంగం కల్పిస్తోంది.
బహుశా…ఈ కథనం చదివిన తర్వాత… “BScతో ఏం అవుతుంది?” అనే ప్రశ్నకు మీ సమాధానం మారొచ్చు.








