బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ (Kanaka Durga)కు తెలంగాణ భక్తులు బంగారు బోనం (Golden Bonam) సమర్పించారు. భాగ్యనగర్ శ్రీమహంకాళి (Sri Mahankali) జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. గత 17 ఏళ్లుగా ప్రతి ఆషాఢ మాసంలో కమిటీ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తోంది. బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డి నుంచి మేళతాళాలు, కోలాటాలు, భేతాళ నృత్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. జోగిని అవిక బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి నృత్యం చేస్తూ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అమ్మవారికి బంగారు బోనంతో పాటు వెండి బోనం, సారె సమర్పించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో శీనానాయక్ (EO Seena Naik), ఆలయ అర్చకులు పాల్గొన్నారు.








