నేషనల్ పాలిటిక్స్ పై రేవంత్ ముద్ర!?
తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటికీ, అంతర్గత విభేదాలు వేధిస్తున్నాయి. మరోవైపు.. కేంద్రంతో పరోక్ష సమరం నడుస్తోంది. ఈ రెండింటి నడుమ రాష్ట్ర కాంగ్రెస్ నిత్యం రగిలిపోతూనే ఉంది. ఈ క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో వీళ్లిద్దరూ భేటీ కాబోతున్నారు. ఈ ముఖాముఖి తర్వాత పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాక, జాతీయ స్థాయిలో తెలంగాణ వేదికగా సరికొత్త పొలిటికల్ నారేటివ్‌ను సెట్ చేయడానికి ఒక వ్యూహాత్మక వేదికగా మారుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో, ఆయన తాజాగా చేసిన కామెంట్స్ కు అధిక ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. చట్టసభల్లో యువత ప్రాతినిధ్యంపై రేవంత్ రెడ్డి సిద్ధం చేసిన ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ‘జై జవాన్, జై కిసాన్, జై యువ’ అనే సరికొత్త నినాదాన్ని అందుకున్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేందుకు ఉన్న కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రతిపాదనను కేవలం రాష్ట్ర కాంగ్రెస్‌లోనే జాతీయస్థాయిలోనూ, ‘ఇండియా’కూటమి వేదికగానూ చర్చకు పెట్టాలని ఆయన రాహుల్ గాంధీని కోరనున్నారు. యువత రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా దేశవ్యాప్తంగా నవతరాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడమే ఈ విప్లవాత్మక ఆలోచన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొంతకాలంగా సాగుతున్న తీవ్ర అంతర్గత విభేదాలు, అసంతృప్తులు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. దీంతో హైకమాండ్ సమక్షంలో ఈ సమస్యలకు ముగింపు పలకడం అత్యవసరంగా మారింది. గత కొద్ది నెలలుగా పెండింగ్‌లో పడిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల భర్తీపై అధిష్టానం ఈ పర్యటనలోనే తుది ముద్ర వేసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి పరిశీలకుల నివేదికల ఆధారంగా అర్హులైన వారికే పదవులు కట్టబెట్టాలని యోచిస్తున్నారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కాలయాపన జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులపై స్పష్టత నివ్వాలని సీఎం, టీపీసీసీ చీఫ్ కోరనున్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించినప్పటికీ, రేవంత్ వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ జాతీయ స్థాయిలో ఏ రకమైన పోరాటం చేయాలి? రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పక్షాన అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై ఖర్గే, రాహుల్‌లతో లోతుగా చర్చించి ఒక క్లియర్ రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లోని అసంతృప్తులకు చెక్ పెడుతూ, మరోవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మార్క్ “యువత, సామాజిక న్యాయం” అజెండాకు సరికొత్త ఇంధనాన్ని అందించే ప్రయత్నమే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అని చెప్పుకుంటున్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక, మంత్రివర్గ నిర్ణయాల ద్వారా రాష్ట్ర స్థాయిలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడమే కాకుండా, 21 ఏళ్ల వయోపరిమితి ప్రతిపాదన ద్వారా జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తనదైన సరికొత్త ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.








