ఆ క్రెడిట్ రాహుల్ కొట్టేయాలని మోదీ ఇంటి ముందు ధర్నా : డీకే అరుణ
దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను భారతీయులు సహించరని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ కొందరు దేశాన్ని అస్థిర పరిచేందు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. నేపాల్ (Nepal), బంగ్లాదేశ్ (Bangladesh)ల మాదిరిగా భారత్‌ను చేస్తామని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ అరాచక శక్తులు ఇందులో ఉన్నాయో అన్నీ ఉయటకు వస్తాయని పేర్కొన్నారు. నీట్ పరీక్ష రద్దు చేయగానే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధర్నా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎవరో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ కొట్టేయాలని మోదీ (Modi) ఇంటి ముందు ధర్నా చేశారని విమర్శలు గుప్పించారు. కేటీఆర్, రేవంత్‌లకు పేపర్ లీక్‌పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీఆరఎస్ హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయ్యిందని, అప్పుడెందుకు రాజీనామా చేయాలేదని నిలదీశారు.ప్రస్తుత ప్రభుత్వంలో కూడా పదోతరగతి పేపర్ లీక్ అయితే ఎవరు రాజీనామా చేశారని ప్రశ్నించారు. సరైన సమయంలో అందరికీ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.








