డీసెంట్ ట్రీట్ “చెన్నై లవ్ స్టొరీ”
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, సిరి హన్మంతు, మౌనిక రెడ్డి, మహేందర్, తదితరులు నటించారు
సంగీతం : మణిశర్మ, ఆర్ట్ : భాస్కర్ ముదావత్, ఎడిటర్ : సంతోష్ నాయుడు
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్, పాటలు : అనంత్ శ్రీరామ్
కథ, కథనం : సాయి రాజేశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ : శ్యామ్ ప్రసాద్ మేక, కో – ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు :ఎస్కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి నంబూరి
విడుదల తేది: 24.07.2026
సినిమా నిడివి: 2 ఘంటల 59 నిముషాలు
హీరో కిరణ్ అబ్బవరం, (Kiran Abbavaram) శ్రీ గౌరి ప్రియ, (Sri Gouri Priya) జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్,(SKN) సాయి రాజేశ్(Sai Rajesh) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం “చెన్నై లవ్ స్టోరీ”(Chennai Love Story), కాకపోతే ఈ సినిమాకి సాయి రాజేష్ డైరెక్షన్ చేయలేదు కథ మాత్రమే అన్చించారు. రవి నంబూరి అనే సీనియర్ రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేశారు. చాల ఏళ్ళ తరువాత మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” అనే సినిమాకు లవ్ థీం బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించారు. బేబీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుండీ మంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. పైగా ట్రైలర్ లోనే కల్ట్ క్లాసిక్ అని వేసుకున్నారు. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రెస్ మీట్స్ లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కీ న్యాయం జరిగిందా? తెలుగు ప్రేక్షకుడు ఏమని తీర్పు ఇచ్చాడో ఈ సమీక్ష లో చూద్దాం.
ఇవి కూడా చదవండి
కథ :
కాలేజీ రోజున నుంచి అజయ్ (త్రిగుణ్) నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. రెండేళ్ళ స్నేహం మూడేళ్ళ పాటు ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కే టైంలో ప్రియురాలు నివేదిత అలియాస్ నివిని వదిలేసి వెళ్లిపోతాడు అజయ్. ఈ విషయంపై నిలదీస్తే.. జో (మౌనిక రెడ్డి) అనే అమ్మాయిని ప్రేమించానని, ఆమె కోసమే వెళ్లిపోతున్నానని నివికి చెబుతాడు. ప్రియుడితో పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో డిప్రెషన్‌కు గురైన నివి తాగుడుకు బానిస అవుతుంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి చెన్నైకి షిఫ్ట్ అవుతుంది. అదే టైంలో నివికి, అలాగే ఆమె ఫ్రెండ్స్‌కి దేవుడు అలియాస్ స్టీవెన్ శంకర్(కిరణ్ అబ్బవరం) పరిచయం అవుతాడు. అతను సినిమా డైరెక్టర్ అవ్వాలని చెన్నైకి వస్తాడు. డైరెక్షన్ ఛాన్స్ కోసం బాగా స్ట్రగుల్ అవుతుంటాడు. మొదట్లో స్టీవెన్ అంటే నివికి నచ్చదు. ఒక దశలో అతనితో పెద్ద గొడవ కూడా పెట్టుకుంటుంది..! కానీ, తర్వాత అతనిపై జాలి పడుతుంది. అతని ప్యాషన్ చూసి, దర్శకుడు పి. వాసు వద్ద అవకాశం ఇప్పిస్తుంది. ఆమె చేసిన సాయానికి స్టీవెన్ ఆమెకు దాసుడైపోతాడు. దీంతో తన ఫస్ట్ లవ్‌ను మర్చిపోయి, స్టీవెన్‌ను పెళ్లి చేసుకోవాలని నివి డిసైడ్ అవుతుంది. అదే సమయంలో స్టీవెన్ కూడా తన మొదటి సినిమాకు అవకాశం సంపాదిస్తాడు. అంతా సంతోషం గా వున్నా సమయం లో వీరి జీవితాల్లో ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంటుంది. అదేంటి? దాని వల్ల వీరి జీవితాలు ఏమయ్యాయి? అనేది మిగిలిన కథ.
నటీనటుల హవబవాలు :
ఈ చిత్రం లో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియా. ఈమె లుక్స్ ఎంత నేచురల్ గా ఉన్నాయో.. పెర్ఫార్మెన్స్ కూడా అంతే నేచురల్ గా ఉంది అని చెప్పాలి. పక్కన ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నా .. అందరినీ తన పెర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసేసింది. ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం చేసిన సినిమాల్లో… బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి. స్టీవెన్ శంకర్ పాత్రలో లీనమయ్యాడు. ఇతను పలికిన కొన్ని వన్ లైనర్స్ కూడా పేలాయి. ఎమోషనల్ గా కూడా ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. త్రిగుణ్ ఒక రకంగా సెకండ్ హీరో టైపు పాత్ర చేశాడు అని చెప్పాలి. ఓ కే బాగానే చేశాడు. సిరి హనుమంతు ఫ్రెండ్ రోల్లో ఓకె అనిపించింది. మిగతా నటీనటుల పాత్రల సంగతి ఎలా ఉన్నా…ఉన్నంత వరకు వారికి ఈ చిత్రం లో మంచి స్క్రీన్ స్పేస్ అయితే దొరికింది అని చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు :
సాయి రాజేష్ రైటింగ్‌లో కొన్ని సంభాషణలు సోషల్ మీడియా జనాలకు, నిబ్బా-నిబ్బీలకు కనెక్ట్ అవ్వొచ్చు. సెకండాఫ్ లో అక్కడక్కడా అందాల రాక్షసి వంటి సినిమాల ఛాయలు కూడా కనిపిస్తాయి. అయితే మణిశర్మ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్, ఒక రకంగా ఈ సినిమాకి ప్రాణం పోసింది అదే. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంది. కొంత పోర్షన్‌ను ట్రిమ్ చేయొచ్చు, విశ్వాస్ డానియల్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. చెన్నై నేపథ్యాన్ని బాగా చిత్రీకరించారు. ఇక దర్శకుడు రవి నంబూరి విషయానికి వస్తే.. సాయి రాజేష్ ఇచ్చిన కథ, కథనాల్లో దర్శకునిగా తన వంతు ప్రయత్నం సిన్సియర్ గానే చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ని తాను తెరకెక్కించిన తీరు ఇందులో బాగుంది. కాకపోతే కథనం ఒక సమయంలో రొటీన్ అయ్యిపోయేసరికి తన దర్శకత్వం ద్వారా కూడా ఏమి చేయలేని పరిస్థితి అనిపించింది. తన వర్క్ వరకు మాత్రం తాను బానే చేసారని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.
విశ్లేషణ :
మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒక డీసెంట్ గా సాగే ఎమోషనల్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. రిలీజ్‌కి ముందే, అంటే ట్రైలర్లోనే ‘చెన్నై లవ్ స్టోరీ’కి కల్ట్ క్లాసిక్ అనే బిరుదు ఇచ్చేసుకున్నారు మేకర్స్. దానికి తగ్గట్టు ఈ సినిమా కథాకథనాలు వున్నాయి.. సాయి రాజేష్ ఎంచుకున్న కోర్ ఎమోషనల్ పాయింట్ ఒకింత బాగుంది అనిపిస్తుంది. దానికి చిన్న ఫాంటసీ ఎలిమెంట్ ని జోడించి దానికి అనుగుణంగా రాసుకున్న కొన్ని సీన్స్ వాటిని ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా అనిపిస్తుంది. కాని సెకండాఫ్‌పై ఎగ్జైట్మెంట్ కూడా క్రియేట్ చేయదు. సెకండాఫ్‌లో ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అని ఆశించిన ప్రేక్షకులకు అక్కడక్కడా నిరాశే ఎదురవుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు, కుక్కల ఫైట్ మినహా ఏదీ ఎక్సైటింగ్‌గా అనిపించదు. ప్రేమకథల్లో బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఎమోషన్ అనేది వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయి. ‘బేబీ’ సినిమాకి అదే ప్లస్ అయ్యింది.. ఇందులో మిస్ అయ్యింది అని చెప్పొచ్చు! తీయడానికి కథేమీ లేనప్పుడు సాగదీయడం తప్ప చేసేది ఏమీ ఉండదు. భారీ అంచనాలు పెట్టుకుని వెళ్తే నిరాశ తప్పదు. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్లేవారికి డీసెంట్ ట్రీట్ ఇస్తుంది.








