అటా మహాసభల్లో ‘కమ్యూనిటీ టు లీడర్‌షిప’ సదస్సు
19వ అటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ మహాసభల్లో ఈసారి సరికొత్త రాజకీయ, సామాజిక సదస్సును ఏర్పాటు చేశారు. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకలలో భాగంగా ఆగస్టు 1వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి 3:00 గంటల వరకు “కమ్యూనిటీ టు లీడర్షిప్: ది ఇండియన్ అమెరికన్ జర్నీ ఇన్ పబ్లిక్ సర్వీస్ టు షేప్ ది ఫ్యూచర” అనే అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చ జరగనుంది. అమెరికా రాజకీయాల్లో, పబ్లిక్ సర్వీస్‌లో భారతీయ అమెరికన్ల పాత్ర, భవిష్యత్తును వారు ఏ విధంగా ప్రభావితం చేయగలరు అనే అంశాలపై ఈ సదస్సులో లోతుగా చర్చించనున్నారు.
ఈ సదస్సులో అమెరికా రాజకీయ రంగంలో కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు ప్రవాస తెలుగు ప్రముఖులు ప్యానెలిస్ట్‌లుగా వ్యవహరించి దిశానిర్దేశం చేయనున్నారు:
సన్నీ రెడ్డి: మిచిగాన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్ మరియు వేన్ స్టేట్ యూనివర్శిటీ గవర్నర్.
బంగార్ రెడ్డి: టెక్సాస్ కమ్యూనిటీ అవుట్‌రీచ్ డైరెక్టర్.
శ్రీలేఖ రెడ్డి పల్లె: వర్జీనియా ఏషియన్ అడ్వైజరీ బోర్డ్ చైర్. ఈమె ఈ సదస్సుకు మోడరేటర్‌గా కూడా వ్యవహరించనున్నారు.
అమెరికాలో స్థిరపడిన తెలుగు సమాజం కేవలం ఆర్థిక, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, ఇక్కడి రాజకీయ వ్యవస్థలోనూ, పబ్లిక్ సర్వీస్‌లోనూ లీడర్లుగా ఎలా ఎదగాలనేదానిపై ఈ చర్చా వేదిక స్పూర్తినిస్తుందని అటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా మరియు కోర్ కమిటీ సభ్యులు తెలిపారు.
అమెరికా రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న తెలుగువారు, ముఖ్యంగా యువత ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.








