బీజేపీకి బీఆర్ఎస్ భయపడుతోందా..? ‘నీట్’పై మౌనం ఎందుకు?
దేశవ్యాప్తంగా ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ దేశంలోని ప్రధాన బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నాయి. కానీ, తెలంగాణ రాజకీయ యవనికపై మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బలమైన విద్యార్థి విభాగాలు, క్షేత్రస్థాయి యంత్రాంగం ఉన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఈ అంశంపై మౌనాన్ని పాటిస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు కేవలం కాంగ్రెస్ – బీజేపీల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాకు ప్రతీకారంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆఫీసులను బీజేపీ శ్రేణులు ముట్టడిస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద కూడా రెండు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. ఈ రాజకీయ హడావిడి, రోడ్డెక్కి చేసుకుంటున్న గొడవల మధ్య విద్యార్థుల జీవితాలకు సంబంధించిన నీట్ పేపర్ లీకేజీ అంశం తెలంగాణలో మూలనపడిపోయింది.
తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి ఇప్పటివరకు ఏ చిన్న ప్రజాసమస్య వచ్చినా, ప్రత్యేకించి విద్యార్థుల అంశాలపై తీవ్రంగా స్పందించే బిఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు గళమెత్తుతుంటే, తెలంగాణ ప్రతిపక్షం మాత్రం నీట్ లీకేజీపై ఎందుకు సరైన రీతిలో స్పందించడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ మౌనం వెనుక పలు ప్రచారాలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం బీజేపీకి భయపడుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో నమోదైన కేసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి కారణంగానే కమలం పార్టీని నేరుగా ఢీకొట్టేందుకు గులాబీ దళం వెనుకాడుతోందనే టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో అవగాహన లేదా పొత్తు పెట్టుకునే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో దండెత్తడం వ్యూహాత్మకంగా మంచిది కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ వహిస్తున్న ఈ నిమ్మకు నీరెత్తిన వైఖరిని అధికార కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. బీజేపీ – బీఆర్ఎస్ రెండూ ఒక్కటే, బిఆర్ఎస్ అనేది బీజేపీకి బి టీమ్ అని కాంగ్రెస్ నాయకులు పదేపదే చేస్తున్న విమర్శలకు ఈ మౌనం మరింత బలాన్ని చేకూరుస్తోంది. విద్యార్థి లోకం ఆవేదనలో ఉన్న సమయంలో తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందనే భావన ప్రజల్లోకి వెళుతోంది.
రాజకీయ ప్రయోజనాలు, భవిష్యత్తు సమీకరణలు ఎలా ఉన్నప్పటికీ.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పేపర్ లీకేజీ వంటి సున్నితమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం మౌనంగా ఉండటం ఖచ్చితంగా విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల వైపు నిలబడి పోరాడాల్సిన సమయంలో బీఆర్ఎస్ పాటిస్తున్న ఈ వ్యూహాత్మక మౌనం ఆ పార్టీకి రాజకీయంగా లాభిస్తుందా లేక ప్రజాదరణను మరింత దిగజారుస్తుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.








