అంతరిక్షానికి ఎగిరిన తెలుగు కుర్రాళ్లు… భారత కొత్త స్పేస్ హీరోలు!
“గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోయినట్టే…”
మన తెలుగు ఇళ్లలో తరతరాలుగా వినిపిస్తున్న మాట ఇది. లక్షలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఆ ఒక్క ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. అలాంటి ఉద్యోగం ఇస్రో (ISRO)లాంటి ప్రతిష్టాత్మక సంస్దలో వస్తే..ఇంకేముంది పండుగే ..జీవితంలోనే అతిపెద్ద విజయమే. కానీ… ఇద్దరు తెలుగు కుర్రాళ్లు మాత్రం అలా భావించలేదు. ఆ ఉద్యోగాలనే వదిలేశారు. భద్రమైన భవిష్యత్తును, నెల నెలా వచ్చే జీతాన్ని, సమాజంలో గౌరవాన్ని ఒకే ఒక్క నిర్ణయంతో పక్కన పెట్టేశారు.
అప్పట్లో వాళ్లను చూసి చాలామంది “తింగరితనం, కుర్రతనపు ఆలోచనలు” అని నవ్వుకున్నారు. క్లాసులు పీకారు. కానీ సరిగ్గా ఎనిమిదేళ్లు తిరిగేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఇద్దరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేశారు. ఎందుకంటే వాళ్లు సాధించిన విజయం అలాంటిది. వాళ్లేం సాధించారు. అసలు ఎవరు వాళ్లు?
ఆ ఇద్దరు మొనగాళ్లు పవన్ కుమార్ చందనా, నాగా భరత్ డాకా. వాళ్లు సాధించిన విజయం..ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ప్రవేశించి… భారతదేశాన్ని అమెరికా, చైనాల సరసన నిలబెట్టడం.
అసలు అంతరిక్షం అంటేనే మామూలు వాళ్లకు ఊహకు అందనిది. అలాంటిది ఈ స్దాయి సక్సెస్ అంటే మాటలా.అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడీ కుర్రాళ్ల వంక చూస్తోంది.అయితే ఈ విజయం ఒక్క రోజులో, ఒక్క ఆలోచనలో రాలేదు. దాని వెనక ఎంతో కష్టం.ఎన్నో నిద్రలేని రాత్రులు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్లానింగ్.
ఇవి కూడా చదవండి
భయం కంటే కలే పెద్దదయ్యాక…
ఇస్రోలో పనిచేస్తున్న రోజుల్లో పవన్, భరత్‌లను ఒకే ఒక ప్రశ్న ప్రతిరోజూ వెంటాడేదని చెప్పారు. “భారత్‌లో అత్యుత్తమమైన ఇస్రో ఉంది… కానీ ప్రపంచ స్థాయిని శాసించే ప్రైవేట్ స్పేస్ కంపెనీ మన దేశంలో ఎందుకు లేదు?”. వినటానికి చిన్న ప్రశ్నే. కానీ దాని సమాధానం మాత్రం విశ్వమంత.
ఎందుకంటే అప్పటికి భారత్‌లో ప్రైవేట్ రాకెట్ల తయారీకి అసలు స్పష్టమైన రూల్సే లేవు. ఇన్వెస్టర్లు నమ్మి రూపాయి తెచ్చి పెడతారో లేదో తెలీదు, ఒకవేళ ప్రయోగం విఫలమైతే రోడ్డున పడి జీవితాన్ని సున్నా నుంచి మొదలుపెట్టాల్సిందే. అర్దమైంది కదా… ఈ కథలో అసలైన విలన్ ‘భయం’. కానీ వాళ్లు ఆ భయానికి లొంగిపోలేదు. పట్టుదలగా హైదరాబాద్ వేదికగా ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) ను ప్రారంభించారు.
ఒక చిన్న ఆఫీస్, కొద్దిమంది ఉద్యోగులతో మొదలైన ఆ స్టార్టప్… ఈ రోజు రూ. 9,000 కోట్ల ($1.1 Billion) విలువైన భారతదేశపు తొలి స్పేస్-టెక్ యూనికార్న్‌గా ఎదిగింది.
ఒకప్పుడు ఉద్యోగులుగా… ఇప్పుడు తమ సొంత రాకెట్‌తో!
ఇక్కడ మరో విషయం , విశేషం చెప్పుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఇస్రో ఉద్యోగులుగా శ్రీహరికోట ప్రయోగ కేంద్రంలో రాకెట్ ప్రయోగాలను చూసిన పవన్, భరత్… ఈసారి అదే శ్రీహరికోటకు తమ సొంత కంపెనీ నిర్మించిన ‘విక్రమ్-1’ రాకెట్‌తో వచ్చారు. సక్సెస్ అయ్యారు.
లాంచ్ ప్యాడ్ పై రాకెట్ ఇంజిన్లు మండి, పొగలు కమ్ముకుంటూ విక్రమ్-1 ఆకాశంలోకి దూసుకెళ్లిన ఆ 16 నిమిషాలు… వాళ్లు పడ్డ ఏడేళ్ల కష్టానికి సరైన సమాధానం చెప్పాయి. రాకెట్ విజయవంతంగా భూమి కక్ష్యలోకి ప్రవేశించగానే, భారత ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో ఒక కొత్త రికార్డు నమోదైంది.
ఈ విజయంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్ష రంగాన్ని ఏలుతున్న ఎలోన్ మస్క్ ‘SpaceX’ కూడా తన తొలి రాకెట్‌ను కక్ష్యలోకి పంపడానికి 4 సార్లు ప్రయత్నించి,నాలుగోసారి సక్సెస్ అయ్యింది. కాగా స్కైరూట్ మాత్రం తన తొలి ప్రయత్నంలోనే 100% విజయం సాధించింది.
ఇప్పుడు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం.ఈ మిషన్ కోసం రాత్రింబవళ్లు శ్రమించిన టీమ్‌లో 95% మందికి ఇదివరకు ఎలాంటి రాకెట్ లాంచ్ అనుభవం లేదు. వారి సగటు వయసు కేవలం 28 సంవత్సరాలే.ఏముందిలే అనొద్దు. ఆ వయస్సులో చాలా మంది జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారో మనం అంతా రోజు చూస్తునే ఉన్నాం.
ఏమిటి వీళ్ల కాన్సెప్టు అంటే…
ఇన్నాళ్లూ ఏదైనా చిన్న ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలంటే, పెద్ద రాకెట్లలో స్థలం దొరికే వరకు నెలలు లేదా ఏళ్లు వేచి చూడాల్సి వచ్చేది. స్కైరూట్ ఈ పద్ధతినే మార్చేస్తోంది. ‘క్యాబ్ బుక్ చేసినంత ఈజీగా శాటిలైట్ లాంచ్’ని చేసే కాన్సెప్టుని తెచ్చింది.
“మీరు ఊరికి వెళ్లడానికి రైలు,బస్ కోసం నెలలు తరబడి చూడరు, ఓలా లేదా ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంటారు. స్పేస్ రంగంలో మేము చేస్తున్నది సరిగ్గా అలాంటి సేవే” అని సీఈఓ పవన్ కుమార్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో శాటిలైట్ సిద్ధం కాగానే నేరుగా లాంచ్ బుక్ చేసుకునేలా, హైదరాబాద్‌లోని తమ ప్లాంట్‌లో నెలకు ఒక రాకెట్ తయారు చేసే స్థాయిలో స్కైరూట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇది కదా విజన్ అంటే.
మూలాలను మర్చిపోని వినయం
గొప్ప విజయం సాధించినా పవన్, భరత్‌లు తమ మూలాలను మర్చిపోలేదు. విక్రమ్-1 రాకెట్లో భారత అంతరిక్ష పితామహులు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్, నోబెల్ విజేత సర్ సి.వి. రామన్ల సూక్ష్మ విగ్రహాలను పంపి నివాళులర్పించారు. “మేము ఈరోజు ఈ ఎత్తులో నిలబడ్డామంటే… మా కంటే ముందున్న ఆ గొప్ప శాస్త్రవేత్తల భుజాల మీద నిలబడటమే కారణం” అని వారు గుర్తుచేసుకున్నారు.
ముగింపు
చరిత్రకు ఒక చిత్రమైన అలవాటు ఉంది.
ఈరోజు పిచ్చిగా కనిపించే ఆలోచనను…రేపు అదే చరిత్రగా రాస్తుంది.
పవన్ కుమార్ చందనా, నాగా భరత్ డాకా కథ కూడా అలాంటిదే.
వాళ్లే స్పేస్ శక్తులు… అంతరిక్షంలోకి ఎగిరిన తెలుగు కుర్రాళ్లు!
ఇవి కూడా చదవండి








