కొడంగల్‌లో నాపై కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయం మళ్ళీ వేడెక్కింది. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేందుకు, ఓటమి పాలు చేసేందుకు ప్రధాన ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు, తన నియోజకవర్గంలోనే రాజకీయంగా నిర్బంధించేందుకు వ్యూహాలు అమలు జరుగుతున్నాయని ఆరోపించడం వెనుక ఉన్న అసలు రాజకీయ కోణం ఏమిటి? అసలు కొడంగల్‌లో ఏం జరుగుతోంది?
ఈ వివాదానికి ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్ ప్రక్రియ కారణం. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో కేవలం 78 శాతం మాత్రమే నమోదయ్యాయని, మిగతా 22 శాతం అంటే దాదాపు 54,635 ఓట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా బయటపెట్టారు. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ నాయకులు కొడంగల్‌లో 35వేల దొంగ ఓట్లు ఉన్నాయని చేసిన ఆరోపణలను, తదనంతరం కవిత పక్క రాష్ట్రం కర్ణాటక నుండి వచ్చిన ఓటర్లతోనే రేవంత్‌కు ఆ మెజారిటీ వచ్చిందని చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ఎన్నికల్లో తన మెజారిటీ 35వేలు కాగా, ఇప్పుడు నమోదు కాకుండా నిలిచిపోయిన 54వేల ఓట్లను తొలగిస్తే, సాంకేతికంగా తన గ్రాఫ్ దెబ్బతింటుందనేది ప్రతిపక్షాల పక్కా వ్యూహమని రేవంత్ ఆరోపిస్తున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల ఉదాహరణను ప్రస్తావిస్తూ.. క్షేత్రస్థాయిలో ఉనికి లేని చోట కూడా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో తనకు చెక్ పెట్టాలంటే ముందు కొడంగల్‌లోనే తన పునాదులను కదిలించాలని, అందుకోసం బీఆర్ఎస్ – బీజేపీలు లోపాయికారీగా ఒకటై దొంగదెబ్బ తీసేందుకు సిద్ధమయ్యాయని ఆయన విశ్లేషించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న రేవంత్ రెడ్డిని, కొడంగల్‌కే పరిమితం చేస్తే తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనేది ఈ రెండు పార్టీల వ్యూహంగా ఆయన అభివర్ణించారు.
కేవలం ఆరోపణలతోనే సరిపెట్టకుండా, “ఓటు హక్కు లేకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి, బతికున్నా శవంతో సమానం” అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేవలం బిఎల్ఓలపై ఆధారపడకుండా, స్వయంగా ప్రతి ఇల్లు తిరిగి నమోదు కాని ఓటర్ల వివరాలను సేకరించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
సాధారణంగా ఒక నాయకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాక, సొంత నియోజకవర్గంలో విజయం ఏకపక్షంగా ఉంటుందని భావిస్తారు. కానీ, కొడంగల్ విషయంలో సీఎం స్వయంగా క్షేత్రస్థాయి వ్యూహాలపై, ప్రతిపక్షాల పత్తులపై ఇంత బహిరంగంగా మాట్లాడటం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు వేస్తున్న చట్టపరమైన, సాంకేతికపరమైన ఎత్తుగడలను ముందే తిప్పికొట్టడం ఒకటైతే, స్థానిక నాయకత్వాన్ని అప్రమత్తం చేసి, ఓటర్ల నమోదును వేగవంతం చేయడం ద్వారా తన స్థానాన్ని మరింత భద్రం చేసుకోవడం రెండోది.
మొత్తానికి, కొడంగల్ ఓటర్ల నమోదు అంశం కేవలం ఒక నియోజకవర్గ సమస్యగా కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతున్న ముక్కోణపు రాజకీయ పోరాటానికి ప్రతిరూపంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.








