పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ.. ఆంతర్యం?
సరిగ్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్న సమయంలో ఢిల్లీ కేంద్రంగా ఓ రాజకీయ భేటీ జరిగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దీంతో అందరి దృష్టీ ఈ భేటీ వైపే పడింది. ఈ భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) భవిష్యత్తులో ఎన్డీఏకు మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీలో రైతుల సమస్యలపై శరద్ పవార్ ప్రధాని మోదీకి ఓ మెమోరాండం సమర్పించారు.
మోదీ ప్రభుత్వం పార్లమెంట్ లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం మద్దతు కూడగట్టే పనిలో వుంది. సరిగ్గా ఈ సమయంలోనే శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో కేంద్రం తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మద్దతును కూడగట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
అన్ని వర్గాలకూ 50 శాతం సీట్ల పెంపుపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తే, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవచ్చని ఎన్సిపి గతంలోనే సూచించింది.”50 శాతం సీట్ల పెంపు షరతును కాగితంపై ఇవ్వండి, అప్పుడు చర్చిస్తాం,” అని గత వారం జరిగిన విలేకరుల సమావేశంలో సుప్రియా సూలే అన్నారు.








