ఫ్రాన్స్ అంతర్జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కేఎల్ హెచ్ విద్యార్థికి రజత పతకం
కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కేఎల్‌హెచ్ అజీజ్‌నగర్ క్యాంపస్ విద్యార్థి, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ అంతర్జాతీయ స్థాయిలో మరో విశిష్ట విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఫ్రాన్స్‌లో జూలై 11 నుంచి 18 వరకు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక మెన్యూర్స్ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్–2026లో రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు.
భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 86 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో అజేయ ప్రదర్శన కనబరిచారు. తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించి రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ వ్యూహాత్మక ఆలోచన, స్థిరమైన ఆటతీరు, ఆత్మవిశ్వాసంతో ఆకట్టుకుని అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను మరోసారి చాటిచెప్పారు.
టోర్నమెంట్ చివరి రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్, టోర్నమెంట్ టాప్ సీడ్ మాక్సిమ్ లగార్డ్పై రాజా రిత్విక్ అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయం ఆయన అత్యుత్తమ ప్రదర్శనకు నిదర్శనంగా నిలవడంతో పాటు భారత యువ చెస్ క్రీడాకారుల్లో ఆశాజనక ప్రతిభగా ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.
ఈ సందర్భంగా కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఇంజినీర్ కోనేరు లక్ష్మణ్ హవీష్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ పడి ఓటమి లేకుండా రన్నరప్‌గా నిలవడం గొప్ప విజయమని అన్నారు. విశ్వవిద్యాలయం, తెలంగాణ, దేశానికి గర్వకారణంగా నిలిచిన రాజా రిత్విక్‌కు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కేఎల్‌హెచ్ అజీజ్‌నగర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. రామకృష్ణ, అధ్యాపకులు, సిబ్బంది కూడా గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్‌ను అభినందించారు. ఆయన అంకితభావం, పట్టుదల, అసాధారణ ప్రతిభ విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు.
కేఎల్‌హెచ్ విద్యార్థులను విద్యతో పాటు క్రీడలు, పరిశోధన, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఇతర పోటీ రంగాల్లోనూ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించేలా అవకాశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది.








