తెలంగాణ కోసం బీజేపీ బిగ్ ప్లాన్!
తెలంగాణ రాజకీయ వేదికపై అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం అత్యంత వేగంగా పావులు కదుపుతోంది. సాంప్రదాయ రాజకీయ శైలికి భిన్నంగా, పూర్తిగా డేటా ఆధారిత కార్పొరేట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ సాఫ్రాన్ పేరుతో ప్రొఫెషనల్ ఎలక్షన్ ఏజెన్సీలను క్షేత్రస్థాయిలోకి దించనుంది. రాబోయే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే ముమ్మరంగా గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది.
గత అనుభవాలు, ఎన్నికల పలితాలను విశ్లేషించిన బీజేపీ హైకమాండ్, ఈసారి ముగ్గురు కీలక నేతల మార్గదర్శకంలో మూడు ప్రత్యేక ప్రొఫెషనల్ ఏజెన్సీలను రంగంలోకి దించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ఇందులో మొదటిది అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్. హోంమంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షించే ఈ సంస్థ, గత కొన్ని నెలలుగా తెలంగాణలో పార్టీ పొలిటికల్ ఎజెండా, ప్రచార వ్యూహాలను నిశితంగా రూపొందిస్తోంది. ఇక రెండోది జార్విస్. సాంకేతికత, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ ఏజెన్సీ దృష్టి సారించింది. భారీ కాల్ సెంటర్ల నిర్వహణ ద్వారా నియోజకవర్గాల్లోని ఓటర్లను నేరుగా సంప్రదించడం, ప్రజల అభిప్రాయాలను సమీకరించడం, బూత్ కమిటీల పనితీరును పర్యవేక్షించడం వంటి బాధ్యతలను చూస్తోంది. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలు, నాయకుల నిర్వహణ కోసం రూపొందించిన ‘సరళ్ యాప్’ బాధ్యతలను కూడా జార్విస్ సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇక మూడోది అభీష్ట టీమ్. పశ్చిమ బెంగాల్, బిహార్ ఎన్నికలలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించి, మెరుగైన ఫలితాలను అందించిన ‘అభీష్ట’ ప్రొఫెషనల్ ఏజెన్సీని తాజాగా తెలంగాణకు రప్పించారు. ఈ టీమ్ బి.ఎల్.సంతోష్ పర్యవేక్షణలో బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు లోతైన అధ్యయనం చేస్తోంది.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు ‘అభీష్ట’ బృందం ప్రస్తుతం ‘సర్’ అంటే స్టడీ, అండర్ స్టాండ్, రిపోర్ట్ ప్రక్రియను చేపట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉంది? బూత్ లెవెల్ ఏజెంట్లు సరిగ్గా పనిచేస్తున్నారా? అనే అంశాలపై నివేదికలను ఎప్పటికప్పుడు ఢిల్లీ అధిష్టానానికి అందిస్తోంది.
ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేయగల 50 నుంచి 100 మంది ప్రముఖ వ్యక్తుల జాబితాను ఈ టీమ్ సిద్ధం చేస్తోంది. ఇందులో రాజకీయ నేతలతో పాటు సమాజంలో మంచి పేరున్న వ్యాపారవేత్తలు, మేధావులు, సామాజిక వేత్తలు, ప్రజాదరణ ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నారు. వీరిని పార్టీ వైపు ఆకర్షించడం లేదా పార్టీ విజయంలో వీరి మద్దతును వినియోగించుకోవడంపై ప్రణాళికలు రచిస్తున్నారు.
కేవలం కేంద్ర నాయకత్వపు నివేదికలపైనే ఆధారపడకుండా, ఈ ఏజెన్సీలకు లోకల్‌గా అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి బీజేపీ, దాని అనుబంధ సంఘాల నుంచి శిక్షణ పొందిన వాలంటీర్లను నియమించారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పక్కాగా అసెస్ చేసి, దానిని ఓట్లుగా మార్చుకునేందుకు స్పష్టమైన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇతర పార్టీలలో తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులను చేర్చుకోవడంలోనూ ఈ ఏజెన్సీల గ్రౌండ్ రిపోర్టులు మార్గదర్శకంగా నిలవనున్నాయి.
మొదటగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్ల నాడిని పట్టుకుని, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార సరళి వరకు బ్యాక్ ఎండ్ నుంచి నడిపించేందుకు సిద్ధమయ్యారు. కేవలం స్థానిక నాయకత్వ బలంపైనే ఆధారపడకుండా, ఇటువంటి ఆధునిక డేటా విశ్లేషణ, కార్పొరేట్ తరహా ఎలక్షన్ మేనేజ్మెంట్ పద్ధతులు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో వేచి చూడాలి.








