జలధార పనులపై పవన్ కళ్యాణ్ నిఘా..క్వాలిటీ తగ్గితే చర్యలు తప్పవు..!
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల దాహార్తిని శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టుల పనులు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో శరవేగంగా దూసుకుపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న ‘జల్ జీవన్ మిషన్’ మరియు రాష్ట్ర ప్రభుత్వ ‘అమరజీవి జలధార’ మెగా తాగునీటి పథకాల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ తాగునీటి సరఫరా (RWS) శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనుల వివరాలను మ్యాప్స్, క్షేత్ర స్థాయి నివేదికల ద్వారా ఆయన అడిగి తెలుసుకున్నారు.
పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని ఫ్లోరైడ్ మరియు తాగునీటి ఎద్దడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టులలో ఇప్పటికే ఇన్ టేక్ వెల్స్ నిర్మాణం 40 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. దీనితో పాటు ప్రధాన వనరుల నుండి గ్రామాలకు నీటిని చేర్చేందుకు గానూ దాదాపు 200 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్లైన్ల నిర్మాణం కూడా విజయవంతంగా పూర్తయినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వెనకబడిన ఈ ప్రాజెక్టులను కేంద్రంతో సమన్వయం చేసుకుని గడువు పొడిగించుకున్నామని, కాబట్టి పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో పవన్ కళ్యాణ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కేవలం వేగంగా పనులు పూర్తి చేయడం మాత్రమే కాదు, నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పనుల నాణ్యతను పరిశీలించడానికి త్వరలోనే తాను స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని వెల్లడించారు. నిర్ణీత గడువులోపు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఇంజనీరింగ్ విభాగం అహర్నిశలు శ్రమించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎల్నినో (El Nino) ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని, తద్వారా రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనే సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యంగా ప్రకాశం పశ్చిమ ప్రాంతం, పల్నాడులోని మెట్ట ప్రాంతాల్లోని ఆవాసాలకు ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేసుకోవాలని, ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి కొరత అనే మాట వినిపించకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.








