ఉద్రిక్తల నడుమ పార్లమెంట్ కు చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి(Delhi) చేరుకున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీల వివాదం, ప్రతిపక్షాల మెరుపు ధర్నాలు, అరెస్టులతో ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయన నేరుగా పార్లమెంట్ భవనానికి బయలుదేరారు. కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఈ ఉద్రిక్త సమయాల్లో ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో(Narendra Modi) ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాబోయే ఆగస్టు 1వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన అధికారికంగా ఆహ్వానించనున్నారు. అలాగే, ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరికొంతమంది కీలక కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు విడివిడిగా కలవబోతున్నారు.
కేంద్రంలో రాజకీయ సెగలు రేగుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే పరమావధిగా ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. ప్రధాని మరియు కేంద్ర మంత్రులతో జరగబోయే ఈ భేటీలలో.. ఏపీకి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, పెండింగ్ నిధుల విడుదల, విభజన చట్టంలోని హామీల అమలుతో పాటు రాష్ట్రంలో సాగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు విస్తృతంగా చర్చించనున్నారు. ఢిల్లీలో హాట్ హాట్ పరిణామాలు నడుస్తున్న వేళ బాబు పర్యటన ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని ఏపీ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.








