తెలుగు సంస్కృతిని తదుపరి తరాలకు అందించడం అభినందనీయం: ఎర్రబెల్లి దయాకర్ రావు
చార్లెట్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రసంగించారు. అమెరికాలో ఉండి కూడా మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోకుండా తదుపరి తరాలకు అందిస్తున్న ప్రవాస తెలుగువారి కృషిని ఆయన ప్రశంసించారు. తాను గత 30-35 ఏళ్లుగా అనేక సభలకు హాజరవుతున్నానని, అయితే ఇంత అద్భుతంగా జరిగిన సభను తాను ఎక్కడా చూడలేదని ఆయన పేర్కొన్నారు.
టీటీఏ సంస్థను స్థాపించిన డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మల్లారెడ్డి లేకపోతే ఈ సంస్థ ఇంతలా అభివృద్ధి చెందేది కాదని, ఆయనతో పాటు మోహన్, ప్రవీణ్, నవీన్, విజయపాల్, వంశీ వంటి నాయకుల టీమ్ వర్క్‌తో ఈ కన్వెన్షన్‌ను విజయవంతం చేశారని ప్రశంసించారు. ఈ కన్వెన్షన్‌లో వైద్య ప్రముఖులు, సినీ నటులు, రాజకీయ నాయకులు పాల్గొనడం బాగుందని, ముఖ్యంగా ప్రసిద్ధ వైద్యులు డా. నాగేశ్వర్ రెడ్డి గారు, డా. గురునాథ్ రెడ్డి గారు వంటి వారు రావడం సంతోషకరమని అన్నారు.
అమెరికాలో ఉన్నప్పటికీ, మన తెలుగు సంస్కృతిని, భరతనాట్యాన్ని, కళ్యాణ మహోత్సవాలను జరుపుతూ తెలుగు భాషాభిమానాన్ని చాటుకుంటున్న ప్రవాసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన పిల్లలకు తెలుగు నేర్పించాలని, అమ్మమ్మ, తాతయ్యలతో ఫోన్ ద్వారా మాట్లాడిస్తూ మన మూలాలను గుర్తు చేయాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. సంవత్సరానికి ఒక్కసారైనా తమ స్వగ్రామాలకు వెళ్లి పలకరించాలని విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి ఆహ్వానం మేరకు ఒక రోజు వద్దామని వచ్చిన తాను, అందరి ఆత్మీయత చూసి మూడు రోజులు గడపడం తన అదృష్టమని భావిస్తున్నానని దయాకర్ రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు.








