కేసీఆర్ను మళ్లీ సీఎం చేయడమే ధ్యేయం: మెల్బోర్న్లో బీఆర్ఎస్ నేతలు
ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి సారథ్యంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ఎన్నారైలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశంతో ఆస్ట్రేలియా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇతర నగరాల్లోనూ వేడుకలు నిర్వహించి, కేసీఆర్ – కేటీఆర్ అభిమానులను ఏకం చేస్తామని పేర్కొన్నారు. పార్టీకి పన్నెండేళ్లుగా సేవలందించే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు, అలాగే సహకరించిన కార్యవర్గ సభ్యులకు, ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిస్తూ, వాస్తవాలను తెలియజేసే ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ పదేళ్ల ప్రస్థానంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను అనిల్ బైరెడ్డి వివరించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి.. కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులకు, స్కాములకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎండగట్టారు.
ఈ వేడుకల్లో భాగంగా పలువురు ఎన్నారైలకు అనిల్ బైరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా, ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలతో కలిసి పని చేస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భాగస్వామ్యంతో మెల్బోర్న్ వేదిక పండుగ వాతావరణాన్ని తలపించింది. చివరగా కేక్ కట్ చేసి, సభ్యులు శుబాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో అనిల్ బైరెడ్డితో పాటు సీనియర్ నాయకులు రమేష్ ముత్యాల, మధుపర్సా, రాహుల్ నడిదే, సత్య గుండా, రవీందర్ చుక్క, కార్తీక్, కుల్విందర్ గాజువా, స్వప్న, ప్రియాంక, మధులతో పాటు పలువురు ముఖ్య నేతలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.








