ఎన్నికలకు ముందే తెలంగాణలో వేడి.. కేటీఆర్, రేవంత్ మధ్య మాటల తూటాలు
ఎన్నికల ఘట్టానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ, తెలంగాణ రాజకీయ యవనికపై మాత్రం వేడి తీవ్రస్థాయికి చేరింది. విధానపరమైన విమర్శలు, ప్రజాసమస్యలపై సుదీర్ఘ చర్చలు స్థానంలో శ్రుతిమించిన పరుష పదజాలం, వ్యక్తిగత దూషణలు రాజ్యమేలుతున్నాయి. సభ ఏదైనా, వేదిక ఏదైనా… ఎవరు ఎవరిని ఎంత ఘాటుగా తిట్టారనేది మాత్రమే నేటి రాజకీయంలో అర్హతగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి “వాడు, వీడు, అరేయ్, తురేయ్” వంటి ఏకవచన ప్రయోగాలు చేయడం ఇప్పుడు పరిపాటైపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన బాన్సువాడ సభతో పాటు రైతు సంగ్రామ సదస్సులలో ఆయన వాడిన భాషా ప్రయోగం మాజీ మంత్రిగా ఆయనకున్న హుందాతనానికి భిన్నంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ లోపాలను, వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హేళనకర వ్యాఖ్యలు చేయడం, పరుష పదజాలంతో విరుచుకుపడటం ఆయన కొత్త వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. “నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు” అని కేటీఆర్ పదే పదే చెప్తున్న మాటలు ఆయన అనుసరిస్తున్న ఈ దూకుడు రాజకీయాలకే అద్దం పడుతున్నాయి. కేసీఆర్ కాలంలో ఉన్న కాస్త సంయమనం కూడా ఇప్పుడు కనిపించడం లేదని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే పార్టీకి చెందిన హరీష్ రావు విమర్శల్లో ఘాటు ఉన్నప్పటికీ, ఎంతో కొంత హుందాతనాన్ని కాపాడుకుంటుండటం ఇక్కడ గమనార్హం.
ఈ దూషణల పర్వం కేవలం ఒక వైపు నుంచే సాగడం లేదు. కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా, తనదైన శైలిలో సమాధానమిస్తున్నారు. ‘మూడు నెలలకే పిల్లలు పుడతారా?’ అంటూ గతం లో రేవంత్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తూ కేటీఆర్ హేళన చేయడం, దానికి ప్రతిగా రేవంత్ కూడా కౌంటర్లు ఇవ్వడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.
ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వాడిన భాషను రేవంత్ రెడ్డి గుర్తుచేస్తూ తాము కౌంటర్ ఇస్తుంటే… బీఆర్ఎస్ నేతలు మాత్రం సీఎం స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడతారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ కుమ్మరిస్తున్న తిట్ల దండకంపై బిఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయి? రేపు రేవంత్ రెడ్డి కూడా ఇదే స్థాయిలో ఎదురుదాడి చేస్తే దానిని స్వాగతిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సహజమే. కానీ, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి హుందాతనం పక్కనబెట్టి తిట్లే శరణ్యమనుకోవడం లేదా అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా అనొచ్చనుకోవడం రెండూ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నేతల ముఖాముఖి పోరుతో వారి అనుచరులు, శ్రేణులు ఉత్సహపడవచ్చు ఏమో గానీ, సామాన్య ప్రజల్లో మాత్రం నాయకుల పట్ల గౌరవం క్షీణిస్తోంది. కనీస సంస్కారాన్ని, రాజకీయ నిబద్ధతను మర్చిపోయి చేస్తున్న ఈ ‘భాషా యుద్ధం’ తెలంగాణ రాజకీయ భవిష్యత్తును ఎటు వైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.








