జెన్ జీ జపం చేస్తున్న కేటీఆర్, వర్కవుట్ అయ్యేనా?
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఇప్పటిదాకా గ్రామీణ ఓటర్లు, రైతాంగ సమస్యలు, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల చుట్టూనే తమ రాజకీయ వ్యూహాలను తిప్పిన BRS, ఇప్పుడు రూట్ మార్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో యువత, నిరుద్యోగులే లక్ష్యంగా ఒక పక్కా పొలిటికల్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని సరూర్ నగర్లో నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’ బీఆర్ఎస్ రాబోయే రాజకీయ కార్యాచరణకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఊహించని స్థాయిలో తరలివచ్చిన యువత, ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అమలుపై వ్యక్తం చేసిన నిరసన ప్రభుత్వంపై ఎంతటి అసంతృప్తి ఉందో స్పష్టం చేసింది. ఈ జనాగ్రహాన్ని క్యాచ్ చేస్తూ, నిరుద్యోగ సమస్యననే రాబోయే రోజుల్లో తమ ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది.
ఈ వ్యూహంలో అత్యంత ఆసక్తికరమైన అంశం… జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను స్థానిక రాజకీయాలకు కేటీఆర్ జోడించిన తీరు! ఇటీవల నేపాల్‌లో యువత చేపట్టిన ‘జెన్ జీ మూవ్మెంట్’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే పాయింట్‌ను కేటీఆర్ తన డిజిటల్ వ్యూహంలో భాగం చేసుకున్నారు. పది నెలల క్రితం తాను చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ “ప్రభుత్వాలు జెన్ జీ, యువత ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రపంచ పరిణామాలే నిదర్శనం” అని పేర్కొన్నారు. నిరుద్యోగ తిరుగుబాటును తాను ముందే ఊహించాననే చర్చకు ఇది గట్టి పునాది వేసింది.
బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ వెనుక కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. కేవలం పల్లెలు, రైతులకే పరిమితం కాకుండా పట్టణాల్లోని గ్రాడ్యుయేట్లు, విద్యార్థులు, ఉద్యోగార్థులను తమ వైపు తిప్పుకునే స్కెచ్ ఉంది. గ్రూప్ ఎగ్జామ్స్ రద్దు, నోటిఫికేషన్ల లీకేజీలు, నియామకాల జాప్యం వంటి అంశాలపై నిరుద్యోగుల్లో ఉన్న ఆక్రోశానికి నాయకత్వం వహించడం ద్వారా వాళ్లకు తాము అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్స్ మార్చే తాజా తరం మద్దతు కూడగట్టడం ద్వారా క్షేత్రస్థాయిలో పెను మార్పులు తీసుకురావాలనేది దీని వెనుక ప్రధాన వ్యాహంగా కనిపిస్తోంది.
రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసనలు, యువజన సదస్సులు నిర్వహించేందుకు బీఆర్ఎస్ బ్లూప్రింట్ సిద్ధం చేస్తోంది. గతంలో సాధించిన రైతాంగ పోరాట అనుభవానికి, ఇప్పుడు యువత ఉద్రేకాలను జతచేసి భవిష్యత్తులో ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెంచడమే కేటీఆర్ ప్రధాన లక్ష్యం. అయితే, కేవలం అధికార పక్షాన్ని విమర్శించడమే కాకుండా, తాము మళ్లీ వస్తే యువత సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతామో నమ్మించడమే బీఆర్ఎస్ ముందున్న అసలైన సవాలు. మరి కేటీఆర్ ప్రయోగించిన ఈ జెన్ జీ కార్డ్ ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుందో, గులాబీ దళానికి పూర్వవైభవం తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే!








