కోహ్లీ ఇచ్చిన ఒక్క సలహా.. పీవీ సింధు కెరీర్‌ను ఎలా మార్చేసిందంటే..?
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక ‘జపాన్ ఓపెన్ 2026’ టైటిల్‌ను కైవసం చేసుకుని, ఈ టోర్నీ గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. గత రెండేళ్లుగా సరైన ఫామ్ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సింధు, ఈ మెగా టైటిల్‌తో మళ్లీ మునుపటి ఫామ్‌ను అందుకున్నారు. అయితే, ఈ అద్భుత పునరాగమనం వెనుక టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక రహస్య సలహా ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఫామ్ కోల్పోయి కెరీర్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో సింధు ఒకసారి విరాట్ కోహ్లీని సంప్రదించారు. గతంలో కోహ్లీ కూడా సెంచరీల కరవుతో మూడేళ్ల పాటు ఫామ్ కోసం ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. “ఆ కఠినమైన రోజుల్లో ఒత్తిడిని ఎలా అధిగమించావు?” అని సింధు కోహ్లీని అడిగగా… దానికి కోహ్లీ చాలా కూల్ గా.. “నేను పరుగులు సాధించాలనే ఒత్తిడిని పక్కనబెట్టి, క్రికెట్ ఆడటంలో ఉండే అసలైన సంతోషాన్ని మళ్లీ వెతుక్కున్నాను” అని బదులిచ్చాడట. ఈ చిన్న సమాధానమే సింధు ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందట.
కాలి వేలి గాయం (టాప్ లిగమెంట్) కారణంగా డాక్టర్లు సింధుకు మూడు నెలల విరామం ప్రకటించారు. ఆట నుంచి సుదీర్ఘ విరామం తీసుకోవడం వల్ల ఆమె మానసికంగా మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఆమె భర్త వెంకట దత్త సాయి.. సింధును అమెరికాకు తీసుకెళ్లారు. అక్కడ విరాట్ కోహ్లీ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. సింధులో బ్యాడ్మింటన్ పట్ల ఉన్న ప్రేమను మళ్లీ చిగురింపజేశారు. ఎలాంటి స్టార్ ఇమేజ్ లేకుండా, ఒక సాధారణ వ్యక్తిలా అట్లాంటాలోని ఎక్సోస్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఫెసిలిటీలో కుటుంబ సభ్యుల మధ్య ఆమె ప్రత్యేక శిక్షణ మరియు పునరావాసం పొందారు.
కేవలం మానసిక స్థైర్యమే కాకుండా.. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సింధు ఆటపై ఆమె 13 మంది సభ్యుల బృందం ప్రత్యేక డేటా విశ్లేషణ చేసింది. అందులో సింధు అటాకింగ్ మైండ్‌సెట్ తగ్గిందని, పాయింట్ల కోసం ప్రత్యర్థుల తప్పులపై ఎక్కువ ఆధారపడుతోందని గుర్తించారు. ఈ లోపాలపై కఠినంగా శ్రమించి, టోర్నీకి ముందే సింధు తన బరువును కూడా 3.5 కిలోలు తగ్గించుకున్నారు. ఈ క్రమశిక్షణే చివరకు జపాన్ ఓపెన్ ఫైనల్లో అకానె యమగూచిపై ఘన విజయం సాధించి ట్రోఫీ ముద్దాడేలా చేసింది.








