హీరో విజయ్‌కు ఒక రూల్… సీఎం విజయ్‌కు మరో రూల్?!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
తమిళ, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు… బెనిఫిట్ షోలు, ఆకాశాన్నంటే టికెట్ రేట్లు, అర్ధరాత్రి అభిమానుల హంగామా కామన్. కానీ,తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ‘జన నాయగన్’ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యేలా కనపడుతోంది. అదనపు టికెట్ రేట్లకు అవకాశం లేదు… మైనర్లకు అసలు ఎంట్రీయే లేదు… థియేటర్లపై ప్రత్యేక నిఘా అంటున్నారు.నిర్మాతలు బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ఈ విషయాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్దాయిలో ఉన్న హీరో సినిమా రిలీజ్ కు ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఏమిటి..దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి?
తమిళ, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘జన నాయగన్’ సినిమా ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రావటానికి రంగం సిద్ధం అయింది.మొదట సెన్సార్ ఇబ్బందుల కారణంగా విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా..ఆ తర్వాత విజయ్ రాజకీయంగా బిజీ కావడంతో సినిమాను విడుదల చేసేందుకు వీలు పడలేదు. ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అనే విషయం తెల్సిందే. దాంతో సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్‌కి రెడీ అయింది.
విపరీతమైన ఆసక్తి
విజయ్ రాజకీయాల్లో కి రావటం వల్ల ఆయన ప్రత్యర్థులు ఈ సినిమాను విడుదల కాకుండా ప్రయత్నించారు అనేది అందరికీ తెలిసిందే. దాంతో ఈ సినిమాను అప్పటి ప్రభుత్వం ఎందుకు విడుదల అడ్డుకుందా,అందులో అంత ఆపాల్సినంత కంటెంట్ ఏముందా అని చాలా మందిలో ఆసక్తి ఉంది. దాంతో తమిళనాటు ఈ సినిమా చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టేందుకు రెడీ అవుతున్నారు.
అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయిన గంటల్లోనే లక్షల కొద్ది టికెట్లు బుక్ అవటం మొదలైంది. అందులోనూ విజయ్ నటించిన చివరి మూవీ అని ప్రచారం కావడంతో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ప్రేక్షకులు సైతం అడ్వాన్స్ బుకింగ్‌కి రెడీ అయ్యారు. కానీ ఇక్కడే సమస్య మొదలైంది.
బాక్సాఫీస్ కంటే రాజకీయాలే ముఖ్యం!
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి, చివరి సినిమా ఇది. అందుకే ఇప్పుడు విజయ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాలో సీన్స్ కన్నా, రిలీజ్ విషయంలో జరిగే నిర్ణయాలే రాజకీయంగా తీవ్ర విశ్లేషణకు గురవుతాయి.
ఒక చిన్న తప్పు… పెద్ద రాజకీయ నష్టంగా మారొచ్చు.
గతంలో అభిమానుల హంగామా బాక్సాఫీస్ కలెక్షన్లకు ప్లస్ అయ్యేది. కానీ ఇప్పుడు అదే హంగామా రాజకీయంగా మైనస్ అయ్యే ఆందోళన కనిపిస్తోంది. టికెట్ బ్లాక్ మార్కెట్, థియేటర్ల వద్ద తొక్కిసలాటలు, మైనర్లు హంగామా చేయడం… వీటిలో ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరిగినా, సోషల్ మీడియా విమర్శలతో పాటు ప్రతిపక్షాలకు అది పెద్ద ఆయుధంగా మారుతుంది. అందుకే విజయ్ కెరీర్లో మొదటిసారిగా బాక్సాఫీస్ రికార్డుల కంటే తన రాజకీయ ఇమేజ్ను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
18 ఏళ్లలోపు పిల్లలకు నో ఎంట్రీ!
‘జన నాయగన్’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటికే ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో 18 ఏళ్లలోపు పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోకి అనుమతించొద్దని ఎగ్జిబిటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్క థియేటర్ కూడా ఈ నిబంధనను ఉల్లంఘించకూడదని మేకర్స్ చాలా కఠినంగా హెచ్చరిస్తున్నారు.
A సర్టిఫికేట్ అంటే?
‘A’ (Adults Only) సర్టిఫికేట్ పొందిన సినిమాలను కేవలం 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే చూడాలి. చిన్న పిల్లలను లేదా మైనర్లను థియేటర్లలోకి అనుమతించడం చట్టరీత్యా నేరం. ముఖ్యమంత్రి సినిమాకే ఈ రూల్స్ వర్తించకపోతే ప్రతిపక్షాలు, మీడియా ఓ రేంజిలో హంగామా చేస్తుంది.
టికెట్ రేట్లు పెంచితే కఠిన చర్యలు!
తమిళ, తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలో పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్ల పెంపు తరచూ వివాదంగా మారుతుంటుంది. అభిమానుల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు అనధికారికంగా టికెట్ ధరలు పెంచడం చూస్తూనే ఉంటాం. అయితే ‘జన నాయగన్’ విషయంలో అలాంటివేమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అధిక ధరలకు టికెట్లు అమ్మితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, అది నేరుగా సీఎం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే టికెట్ రేట్లు పెంచవద్దని థియేటర్ యాజమాన్యాలకు హెచ్చరికలు వెళ్లాయి.
950 స్క్రీన్లు… 3000 థియేటర్లు: భారీ పోలీస్ నిఘా!
ఈ సినిమా తమిళనాడు అంతటా దాదాపు 950 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రేక్షకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీస్ యంత్రాంగంతో కలిసి ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు.
తెలుగులో పరిస్ధితి ఏమిటి?
మరో ప్రక్క ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం `భగవంత్ కేసరి` రీమేక్ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డైరక్టర్ వినోద్ చెప్పిన వివరాల ప్రకారం.. `జన నాయగన్` చిత్రం 50 శాతం మాత్రమే `భగవంత్ కేసరి`ని పోలి ఉంటుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో దాదాపు 60 శాతం వరకు ఒరిజినల్ కథలోని సీన్లు ఉన్నా..సెకండాఫ్ లో మాత్రం కేవలం 20 శాతం మాత్రమే రీమేక్ అంశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.దాంతో తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయినా బుక్సింగ్స్ పరంగా ఇప్పటి వరకు పెద్దగా జోరు, జోష్ కనిపించడం లేదు.దానికి తగ్గట్లే ప్రమోషన్స్ తెలుగునాట టీమ్ చేయటం లేదు.
ఏదైమైనా
ఇది కేవలం ఒక సినిమా రిలీజ్ స్టోరీ కాదు… ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ తన రాజకీయ ఇమేజ్ను కాపాడుకోవడానికి ఎదుర్కొంటున్న తొలి పెద్ద పరీక్ష. మరి ఒక్క వివాదం కూడా లేకుండా ‘జన నాయగన్’ ఈ పరీక్షలో నెగ్గుతుందో లేదో చూడాలి!








