అందరి సమష్టి కృషితో మెగా కన్వెన్షన్ విజయవంతం: విజయ్‌పాల్ రెడ్డి
చార్లెట్ వేదికగా జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ విజయపాల్ రెడ్డి సంస్థ ప్రయాణాన్ని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. కన్వెన్షన్ విజయవంతం కావడంలో భాగస్వాములైన అతిథులకు, కన్వెన్షన్ నిర్వహణలో అహర్నిశలు శ్రమించిన చార్లెట్, ఇతర ప్రాంతాలకు చెందిన వాలంటీర్లకు, స్టాఫ్, ఫుడ్ సర్వీస్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పది సంవత్సరాల క్రితం ఒక చిన్న విజన్‌తో మొదలైన టీటీఏ ప్రయాణం, ఇవాళ ఒక బలమైన జాతీయ సంస్థగా ఎదగడంలో నాయకులు, వాలంటీర్ల కృషి , త్యాగం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాలతో…
అమెరికాలో ఉన్న తెలుగు కమ్యూనిటీకి సేవ చేయడం, స్వదేశంలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం అనే రెండు ప్రధాన లక్ష్యాలతో టీటీఏ పని చేస్తోందని ఆయన వివరించారు. ఈ కన్వెన్షన్ మన సంస్థ సాధించిన విజయాలకు, కమ్యూనిటీ ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన అన్నారు. సంస్థపై నమ్మకంతో తనకు స్వతంత్రంగా పని చేసే అవకాశం కల్పించిన ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డికి, అలాగే సహకరించిన ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులకు, కన్వీనర్, కో-ఆర్డినేటర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చివరగా, వాలంటీర్లకు మద్దతుగా నిలిచిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అండగా ఉంటూ పూర్తి సపోర్ట్‌ను అందించిన మహిళలలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీఏ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.








