తెలుగు రాష్ట్రాల మధ్య తేలని నీటి పంచాయితీ..!
హైదరాబాద్లోని(Hyderabad) జలసౌధ వేదికగా జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) త్రిసభ్య కమిటీ అత్యంత కీలక సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ మరియు వినియోగంపై జరిగిన ఈ చర్చల్లో ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య నీటి పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ వివాదాస్పద అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది.
కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కంబోజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ ఓ.వి. రమేశ్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ కె. నరసింహమూర్తి హాజరయ్యారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, ఉభయ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. అయితే, తాగునీటి విడుదలకు సంబంధించి ఇరు రాష్ట్రాలు తమ పట్టు వీడకపోవడంతో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేకపోయారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని ప్రతిపాదించగా, ఏపీ మాత్రం తమ అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ నీటిని కోరడం వివాదానికి దారితీసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో తాగునీటి అవసరాలకు గల లభ్యత, ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ తదుపరి నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ నెల నాలుగో వారంలో మరోసారి సమావేశమై రెండు రాష్ట్రాల అభ్యర్థనలు, వాటాలపై సమగ్రంగా చర్చించి ఒక స్పష్టతకు రావాలని బోర్డు నిర్ణయించింది. ఈ లోగా ప్రాజెక్టుల పరిధిలోని తాగునీటి అవసరాల డేటాను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.








