పార్టీని మించిన రేవంత్ – ఓవైసీ బంధం.. ఏంటి సంగతి?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరుగుతోందా? పాతబస్తీ రాజకీయాల నాడిని శాసించే మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, విపక్షాల్లో చర్చనీయాంశంగా మారాయి. సైదాబాద్ వద్ద నిర్మించిన నూతన స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ వేదిక ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఒకే వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒకరిపై ఒకరు కురిపించుకున్న ప్రశంసలు కేవలం అభివృద్ధి సంకేతాలు మాత్రమే కావని, రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాల ఆరంభానికి సూచికలని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో తాము బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిన విషయాన్ని అంగీకరించిన అసదుద్దీన్, తెరవెనుక జరిగిన ఒక కీలక హెచ్చరికను బయటపెట్టారు. “రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోకపోతే మీరంతా ఇళ్లలోనే కూర్చోవాల్సి వస్తుందని నేను స్వయంగా కేసీఆర్‌కు పదే పదే చెప్పాను” అని వ్యాఖ్యానించడం ద్వారా గత ప్రభుత్వ పతనానికి రేవంత్ దూకుడే కారణమనే అంశాన్ని నొక్కిచెప్పారు. ఇది బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఎత్తిచూపడమే కాకుండా, రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు ఇచ్చిన భారీ సర్టిఫికెట్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి
అసదుద్దీన్ ప్రసంగంలో అత్యంత కీలకమైన రాజకీయ కోణం.. పార్టీని కాదని రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఆయన సమర్థించడం. “నేను మద్దతు ఇస్తున్నది రేవంత్ రెడ్డికి మాత్రమే, కాంగ్రెస్ పార్టీకి కాదు” అని కుండబద్దలు కొట్టారు. సాధారణంగా ఎంఐఎం అధికారంలో ఉన్న పార్టీలతో సత్సంబంధాలు నెరపుతుందనే ఒక ముద్ర ఉంది. అయితే ఈసారి అసదుద్దీన్ కాంగ్రెస్ హైకమాండ్‌కు లేదా హస్తం పార్టీ సిద్ధాంతాలకు కాకుండా, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పాలనా శైలికే తమ బాసట అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ సహా సమగ్ర తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మరీ ఎక్కువ మర్యాదస్తుడిగా మారిపోయారని, గతంలో మాదిరి దూకుడును ప్రదర్శిస్తూ ప్రజల్లోకి రావాలని హితవు పలికారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశభక్తి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు అసదుద్దీన్ ఏమాత్రం తీసిపోరని రేవంత్ తేల్చిచెప్పారు. కొందరు కావాలనే అసద్‌పై, ఎంఐఎంపై దేశద్రోహ ముద్ర వేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో అసదుద్దీన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న రేవంత్, ఓల్డ్ సిటీ సమగ్ర పురోగతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. తాను సీఎం అయ్యాక ఓవైసీ సోదరులతో పాతబస్తీ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించానని గుర్తుచేశారు. పాతబస్తీ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు సంబంధించి ఎంపీ అసద్ ఇచ్చే ఏ ప్రతిపాదనలనైనా తక్షణమే పరిశీలించి నిధులు విడుదల చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆ వేదికపైనే రేవంత్ ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టి కేవలం రేవంత్ రెడ్డికే మద్దతు ప్రకటించడం ద్వారా అసదుద్దీన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇది ఒకవైపు కాంగ్రెస్‌తో తాము పూర్తిగా కరిగిపోలేదని మజ్లిస్ క్యాడర్‌కు స్పష్టం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వ సారథి అయిన రేవంత్‌తో తమ బంధం అత్యంత పటిష్టంగా ఉందనే సందేశాన్ని ఇచ్చింది. అటు రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ రాజకీయంలో పాతబస్తీ మద్దతును సంపూర్ణంగా తన ఖాతాలో వేసుకుంటూ, ప్రభుత్వంలో తన పట్టును, ఇమేజ్ను మరింత పటిష్టం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు గట్టి హెచ్చరిక పంపడమే కాక, హైదరాబాద్ వేదికగా తిరుగులేని రాజకీయ శక్తిగా తాము కొనసాగుతామని రేవంత్-ఓవైసీల ద్వయం ఈ సభ ద్వారా చాటిచెప్పింది.








