క్రికెట్ చరిత్రలో వైభవ్ సూర్యవంశి సరికొత్త సంచలనం..!
భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే యువ ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) సంచలన ఆటతీరుతో సరికొత్త రికార్డులను సృష్టించాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరపున బరిలోకి దిగిన వైభవ్.. టోర్నమెంట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ తన ట్రేడ్‌మార్క్ అటాకింగ్ శైలితో కేవలం 42 బంతుల్లోనే 3 సిక్సర్లు, 5 ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన 15 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించి.. గత 57 ఏళ్లుగా లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు – 1969లో) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. ఆ తర్వాత పియూష్ చావ్లా (16 ఏళ్ల 307 రోజులు) మూడో స్థానంలో ఉన్నాడు.
వైభవ్ కేవలం 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయి, 92 పరుగుల వద్ద అవుట్ కావడంతో దులీప్ ట్రోఫీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆల్‌టైమ్ రికార్డు తృటిలో చేజారింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన కెప్టెన్సీ నైపుణ్యంతోనూ ఆకట్టుకున్నారు. ఈస్ట్ జోన్ రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మ్యాచ్ ప్రారంభంలో మణికట్టు గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి రావడంతో.. వైభవ్ దాదాపు రెండు గంటల పాటు జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించి నాయకత్వ పటిమను చాటాడు. అటు అద్భుతమైన కెప్టెన్సీ, ఇటు విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్‌కు పెద్ద ఆస్తి కాబోతున్నాడని విశ్లేషకులు కొనియాడుతున్నారు.








